వైసీపీ నేతకు నోటీసులు... ఈసారి ఏపీలో ‘చెప్పు’ ఎఫెక్ట్!

ఈ సమయంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ కు పోలీసులు నోటీసులు అందించారని తెలుస్తోంది!

Update: 2024-12-15 12:54 GMT

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మూడు ఫిర్యాదులు, ఆరు కేసులు అన్నట్లుగా సాగుతున్నాయనే చర్చ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క.. గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయినవారు ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తున్నారనే చర్చా నడుస్తుందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ కు పోలీసులు నోటీసులు అందించారని తెలుస్తోంది!

అవును... గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 'చెప్పు' చూపించి మాట్లాడిన సంగతి తెలిసిందే. దీనికి వెంటనే పేర్ని నాని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేశారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరికొంతమంది వైసీపీ నేతలు కూడా పవన్ కు చెప్పులు చూస్తూ స్పందించారు!

ఇందులో భాగంగా... 2022లో పవన్ కల్యాణ్ కు చెప్పు చూపిస్తూ సీరియస్ కామెంట్స్ చేశారు దువ్వాడ శ్రీనివాస్! ఈ వ్యవహారంపై గత నెలలో జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు! ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణకు హాజరుకావాలంటూ దువ్వాడకు 41ఏ నోటీసులు ఇచ్చారు!

ఈ నోటీసులపై స్పందించిన దువ్వాడ సీరియస్ గా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని చెబుతూ.. గతంలో పవన్ కల్యాణ్ నాటి సీఎం జగన్ తో పాటు తమ పార్టీ నేతలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆ తర్వాతే తాను రియాక్ట్ అయ్యానని.. ఈ నేపథ్యంలో పవన్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఇదే సమయంలో... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు తనను దుర్భాషలాడారని.. బెదిరింపులకు పాల్పడ్డారని.. వీటిపై తాను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశానని.. అయినప్పటికీ కేవలం ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి వదిలిపెట్టారని దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు.

కానీ.. రెండేళ్ల కిందట తాను చేసిన వ్యాఖ్యలకు మాత్రం పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని దువ్వాడ మండిపడ్డారు. ఇదే సమయంలో జనసేన శ్రేణులపై తాను పెట్టిన కేసును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో దివ్వెల మాధురి ఫిర్యాదుపైనా పోలీసులు ఇప్పటివరకూ ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదు చేయలేదని దువ్వాడ విమర్శించారు.

Tags:    

Similar News