వైసీపీ ఎన్నిక‌ల 'యువ‌గ‌ళం'.. చిత్రంగా ఉన్నా నిజ‌మే..!

ఒక‌వైపు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తున్న విష యం తెలిసిందే

Update: 2023-08-07 05:26 GMT

ఒక‌వైపు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పైకి.. ఇది పార్టీని డెవ‌ల‌ప్ చేసుకోవ‌డం.. నాయకుల మ‌ధ్య వివాదాలు, విభేదాలు తొల గించ‌డం.. త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవ‌డం వంటి ప‌లు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. అయితే.. వీటికి మించిన కార‌ణం మ‌రొక‌టి కూడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దండ‌లో దారంలా ఇదే కీల‌క‌మ‌ని చెబుతున్నారు.

ఆ వ్యూహ‌మే.. యువ‌త‌ను పెద్ద ఎత్తున ఆక‌ర్షించ‌డం, యువ‌త‌ను ఎక్కువ మందిని పార్టీలో ప్రాధాన్య‌త‌ను పొందేలా చూసుకోవ‌డం అనే కీల‌క సూత్రాలు ఇమిడి ఉన్నాయి. అయితే.. ఇది ఎంత మందిలోకి వెళ్తుందో తెలియ‌దు కానీ.. టీడీపీ యువ‌గ‌ళం ల‌క్ష్యం కూడా ఇదే. యువ‌త‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హించాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీలక‌మైన యువ‌త ఓట్ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌నే ల‌క్ష్యంతోనే టీడీఈ అడుగులు వేస్తోంది. ఇదిలావుంటే.. అధికార పార్టీ వైసీపీ కూడా.. త‌న‌దైన శైలిలో దూకుడుగానే ఉంది.

యువ‌గ‌ళం పాద‌యాత్ర అంటూ.. టీడీపీ ప్రారంభిస్తే.. వైసీపీ ఏకంగా ''ఎన్నిక‌ల యువ‌గ‌ళం'' పేరుతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల ఎంపిక‌కు క‌స‌ర‌త్తు ప్రారంభించిన‌ట్టు స‌మాచారం. తాడేప‌ల్లి వ‌ర్గాలు తాజాగా చెబుతున్న స‌మాచారం మేర‌కు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా.. యువ‌త ఓట్లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లోనూ.. వైసీపీ చేసిన 'యువ‌జ‌పం' పార్టీకి క‌లిసి వ‌చ్చింద‌ని గుంటూరుకు చెందిన ఒక ముఖ్య నాయ‌కుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు మ‌రింత మంది యువ‌త పార్టీకి క‌లిసి వ‌చ్చిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను యువ‌త‌తో ఎక్కువ‌గా నింపాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్పటికి సుమారు 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన యువ‌త పేర్ల‌ను కూడా ప‌రిశీలించిన‌ట్టు చెబుతున్నారు. ఇక‌, సీనియ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మాట‌ను, పార్టీ గీత‌ను వారు దాటే ప‌రిస్థితి లేకుండా పోయిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల యువ‌గ‌ళానికి పార్టీ సిద్ధ‌మైంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News