ఏపీ పాలిటిక్స్ లో కాపు ఫ్యాక్టర్...2009 రిపీట్...!?

కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే పొత్తుల్ లెక్కలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది అంటున్నారు

Update: 2024-01-12 23:30 GMT

ఏపీ పాలిటిక్స్ లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ఏడాది ముందు దాకా రాజకీయం ఒక ఎత్తు ఆ మీదట మరో ఎత్తు అన్నట్లుగా సీన్ ఉంది. జనసేనను టీడీపీకి సపోర్టింగ్ పార్టీగానే ప్రత్యర్ధి వైసీపీతో పాటు రాజకీయ విశ్లేషకులు చూస్తూ వచ్చారు. కానీ కొత్త ఏడాది ఎంటర్ కావడంతోనే పరిణామాలు చకచకా మారిపోతున్నాయి.

ఏపీలో థర్డ్ ఫోర్స్ గా జనసేన ముందుకు వస్తోంది. ఇప్పటిదాకా చూస్తే జనసేనకు ఏ ఇరవై పాతిక సీట్లతో టీడీపీ సరిపెడుతుంది అని ప్రచారం కూడా ఉంది. ఇక టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే అయిదేళ్ల సీఎం అన్న మాటను లోకెష్ ఒక ఇంటర్వ్యూలో అనేశారు.

కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే పొత్తుల్ లెక్కలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది అంటున్నారు. జనసేనలోకి కాపు లీడర్స్ అంతా వచ్చి చేరుతున్నారు. ఉత్తర దక్షిణ ధృవాలు అనబడే వారు అంతా జనసేన కేంద్రంగా రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్నారు.

తెలుగుదేశం అంటే మండిపడే కాపు నేత ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూడాలనుకోవడం ఏపీ పాలిటిక్స్ లోనే బిగ్ ట్విస్ట్ అని అంటున్నారు. ముద్రగడ వంటి బిగ్ షాట్ జనసేనలో చేరితే కనుక కచ్చితంగా అది ఆ పార్టీకి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలలో మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో అత్యధిక శాతం కాపు ఫ్యాక్టర్ పనిచేసే సీట్లుగా ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్లకు జనసేన పొత్తులో పట్టుబట్టే అవకాశం ఉంది. అలాగే క్రిష్ణా గుంటూరు సహా ఇతర జిల్లాలలో కూడా తాము ప్రభావం చూపించే సీట్ల విషయంలో జనసేన తగ్గేది లేదు అంటోంది.

ఇవన్నీ చూస్తూంటే 2009 నాటి పరిణామాలు గుర్తుకు వస్తున్నాయి. ఆనాడు ఒక వైపు వైఎస్సార్ నాయకత్వంలోని కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ పడుతూండగా అప్పటికి ఒకసారి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి కట్టి ముందుకు వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి ఉమ్మడి ఏపీలో డెబ్బై లక్షలకు పైగా ఓట్లను సాధించింది. సీమాంధ్రలో ఏకంగా 18 సీట్లు కైవశం చేసుకుంది. అందులో అత్యధిక భాగం ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నాయి.

ఇపుడు చూస్తే జనసేన కూడా 2024 ఎన్నికల్లో కీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొత్తులో ఉన్నా లేకపోయినా కూడా జనసేన ప్రభావం అయితే తీసివేయతగినది కాదు అనే అంటున్నారు. దాంతో కాపు ఫ్యాక్టర్ ఎంత అన్నది ఏపీ పాలిటిక్స్ లో మరోసారి చర్చకు వస్తోంది.

ఆ ఎన్నికలు ప్రజారాజ్యం పార్టీకి తొలిసారి కావడంతో సరైన ఎలక్షనీరింగ్ చేసుకోలేకపోవడం వల్ల చాలా వరకూ సీట్లు తక్కువ తేడాతో పోయాయని కూడా చెబుతారు. ఇపుడు అయితే మూడు ఎన్నికలను వరసగా చూసిన అనుభవంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాపులు ఇపుడు మళ్లీ నాడు ప్రజారాజ్యం పార్టీకి ఎంత మనసు పెట్టి వెన్నుదన్నుగా నిలిచారో ఇపుడు జనసేనకు కూడా అలాగే ముందుకు వస్తున్నారు.

ఈ పరిణామాలు అన్నీ చూస్తూంటే 2009 నాటి ఎన్నికలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు. అయితే జనసేన కాపు ఫ్యాక్టర్ ఏపీలో రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుంది అన్న చర్చ ఉండనే ఉంది. కానీ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే అది వైసీపీకే మేలు చేస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి జనసేన పొత్తు వల్ల రాజకీయ లాభం కలుగుతుందా లేదా అన్నదొ మరో వైపు హాట్ హాట్ చర్చగా ఉంది.

Tags:    

Similar News