జగన్ చుట్టూ తిరిగిన అసెంబ్లీ!

ఏపీ పదహారవ అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజుల పాటు రెండు భాగాలుగా సాగాయి. శుక్రవారంతో సభ ముగిసింది

Update: 2024-07-26 20:14 GMT

ఏపీ పదహారవ అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజుల పాటు రెండు భాగాలుగా సాగాయి. శుక్రవారంతో సభ ముగిసింది. మొత్తం ఆరు రోజుల పాటు సాగిన సభలో సభా కార్యకలాపాలు సాగిన సమయం చూస్తే ఏకంగా 27 గంటల 22 నిముషాలుగా ఉంది. ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు ప్రకటనలు చేశారు. అలాగే రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. అవి ఆమోదం పొందాయి. మొత్తం సభ్యులు ఈసారి చేసిన ప్రసంగాలు 68 గా నమోదు అయ్యాయి అంటే బాగానే బిజినెస్ సాగిందని భావించాలి.

ఇదిలా ఉంటే ఈ అసెంబ్లీకి గవర్నర్ ప్రసంగం రోజున ప్రతిపక్ష నేత జగన్ హాజరయ్యారు. కొద్ది సేపు గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి వాకౌట్ చేశారు. ఆ తరువాత వైసీపీ సభకు వెళ్లలేదు. అయితే అసెంబ్లీ మాత్రం జగన్ చుట్టూనే తిరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చర్చలోనూ జగన్ మీద సభలో విమర్శలు చేశారు. జగన్ పాలనలో ఏమి జరిగింది అన్నదే సభ్యులంతా ఏకరువు పెట్టారు.

ఇక ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరుని తిరిగి ఆయనకే పెడుతూ ప్రవేశపెట్టిన మరొక బిల్లులోనూ జగన్ ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గంగా చేసింది అన్నది సభలో సభ్యులు మాట్లాడుతూ విమర్శించరు. లిక్కర్ స్కాం మీద శ్వేత పత్రం రిలీజ్ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున సాగిన చర్చలో అంతా జగన్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినపుడు సైతం చంద్రబాబు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు సహా అంతా కూడా జగన్ మీదనే విమర్శలు చేశారు. కొలంబియా క్రిమినల్ నేతతో జగన్ కి ముడిపెట్టి మరీ నిందించారు. ఆర్ధిక వ్యవస్థ మీద శ్వేత పత్రం రిలీజ్ సందర్భంగా కూడా జగన్ ఆర్ధిక ఉగ్రవాది విధ్వంసకుడు అని విమర్శలు చేశారు.

మొత్తానికి జగన్ అసెంబ్లీకి రాకపోయినా ఆయన ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఇవని చెబుతూ జగన్ ని విమర్శిస్తూ అసెంబ్లీ సాగింది. అయితే వైసీపీ కూడా అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో జరిపిన ధర్నాలోనూ అలాగే తాడేపల్లిలో జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుని విమర్శించడం ద్వారానూ జవాబు ధీటుగా చెప్పే ప్రయత్నం చేశారు.

మొత్తం మీద చూస్తే ఈసారి అసెంబ్లీలో జగన్ మీద అధికార కూటమి విమర్శలు చేస్తే బయట నుంచి వాటిని జగన్ తిప్పికొట్టడం గమనార్హం. అంటే సభకి తాను వెళ్ళకుండా జగన్ ఈ విధంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేశారని అంటున్నారు. అదే సమయంలో సభలో జగన్ లేకపోయినా ఆయన ప్రభుత్వం చేసే తప్పులను ఎండగడతామని ప్రభుత్వం అంటోంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల తాము ముందడుగు చేయలేకపోతున్నామని బాబు అనడం బట్టి చూస్తే జగన్ ప్రభుత్వాన్ని వదిలేలా కూటమి ప్రభుత్వం లేదు. ఆయన అసెంబ్లీకి రాకపోయినా ఆయననే టార్గెట్ చేసుకుంటూ చర్చ జరపాలని చూస్తోంది.

మరో వైపు జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకి రావడం లేదని మీడియా ముఖంగా చెప్పేశారు. తాను అసెంబ్లీ జరిగిన సందర్భాలలో మీడియా ముఖంగానే ప్రభుత్వం చేసే విమర్శలకు బదులు ఇస్తాను అని ఆయన సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక విధంగా వింతైన రాజకీయ పరిస్థితి గానే చూస్తున్నారు. అసెంబ్లీకి విపక్షం వెళ్లకపోవడం ఒక వింత అయితే లేని విపక్షాన్ని టార్గెట్ చేస్తూ సభను నడపడం మరో విడ్డూరం. దేశంలోనే ఈ తరహా పాలిటిక్స్ లో ఏపీ స్పెషల్ కాబట్టి రానున్న కాలంలోనూ ఇదే విధంగా సాగవచ్చు అని అంటున్నారు. సో టీడీపీ వర్సెస్ వైసీపీ సభాపర్వంలో ఇది నూతన అంకం అని అంటున్నారు.

Tags:    

Similar News