స్టాక్ మార్కెట్ ను తీవ్రంగా దెబ్బ తీసిన టాప్ 4 అంశాలివే!
బారత్ సహా పలు దేశాల ఉత్పత్తులపై టారిఫ్ లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్న నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.;
ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా ఉన్న వేళలోనూ రాణించిన భారత స్టాక్ మార్కెట్.. ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదుడుకులకు లోను కావటమే కాదు.. నష్టాల సూచీ రికార్డు స్థాయిలో సాగటం తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రోజులు నేలచూపులు చూసిన సూచీల దెబ్బకు స్టాక్ మార్కెట్ లో మదుపులరు సొమ్ము లక్షల కోట్లు రూపాయిలు ఆవిరి కావటం.. తోపు స్టాకులు సైతం షాక్ తిన్న దుస్థితి. ఇంతకూ ఇలాంటి పరిస్థితికి దారి తీసిన టాప్ 4 అంశాలేంటి? విదేశీ మదుపరులు అమ్మకాలు గడిచిన నాలుగేళ్లలో ఏ విధంగా ఉన్నాయి? లాంటి అంశాల్ని చూస్తే..
స్టాక్ మార్కెట్ నేలచూపులు చూడటానికి దారి తీసిన 4 కీలక అంశాల్ని చూస్తే..
1. బారత్ సహా పలు దేశాల ఉత్పత్తులపై టారిఫ్ లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్న నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇది ప్రధానంగా మదుపరుల ఆందోళనకు కారణం.
2.. దేశీయంగా నిరుత్సాహకరంగా వెలువడిన కార్పొరేట్ ఫలితాలు సెంటిమెంట్ ను మరింత దారుణంగా దెబ్బ తీశాయి. దీంతో.. పరిస్థితులు మరింత క్లిష్టమైన పరిస్థితికి తెర తీస్తున్నాయి.
3. డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అమ్మకాలు జరుపుతున్న ఎఫ్ పీఐలకు లభించే ప్రతిఫలం తగ్గుతోంది. మూలధన లాభాల పన్ను కూడా విదేశీ మదుపర్లను నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఈ కారణంతోనే ఇక్కడ స్టాక్స్ అమ్మేసి.. పన్నుభారం లేని మార్కెట్లకు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు.
4. పెద్ద వ్యాపారాలకు అండగా చైనా సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు.. అక్కడి స్టాక్స్ విలువలు అందుబాటులో ఉన్నాయన్న అంచనాలు విదేశీ మదుపరులను.. మన దగ్గర పెట్టుబడులు పెట్టే వారిని డ్రాగన్ దేశం ఆకర్షిస్తోంది. దీంతో.. విదేశీ పెట్టుబడులు ఇక్కడి నుంచి అక్కడకు తరలి వెళుతున్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే హాంగ్ సెంచ్ సూచీ 23.48 శాతం రాణిస్తే.. దేశీయ నిఫ్టీ 5 శాతం నష్టపోవటమే దీనికి నిదర్శనం.
మరి.. ఎంతకాలం ఇలాంటి పరిస్థితి ఉంటుంది? అన్నది ప్రధాన ప్రశ్న. మార్కెట్ వర్గాలు.. నిపుణుల అంచనాల్ని చూస్తే.. ఇదేమీ దీర్ఘకాలం సాగదని చెబుతున్నారు. ఎందుకంటే.. చైనా కార్పొరేట్ సంస్థల ఫలితాలు 2008 నుంచి అంతగా రాణించకపోవటమే దీనికి కారణంగా చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ క్షీణత నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్లో విదేశీ మదుపరుల అమ్మకాలు తగ్గుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనికి ఎంత కాలం పడుతుందన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వట్లేదు.
మరోవైపు విదేశీ మదుపరులు పెడుతున్న పెట్టుబడులు.. అమ్మకాల్ని చూస్తే.. 2022లో నికర విక్రయాలు రూ.1.21లక్షల కోట్లు ఉంటే.. 2023లో నికర కొనుగోళ్లు రూ.1.71 లక్షల కోట్లు ఉన్నాయి. 2024లో నికర పెట్టుబడులు భారీగా తగ్గాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది కేవలం రూ.427 కోట్లకు పరిమితం కావటం గమనార్హం. ఈ ఏడాది విషయానికి వస్తే.. ఇప్పటివరకు అంటే.. రెండు నెలల పది రోజుల కాలానికి (సుమారుగా 70 రోజులు వేసుకోండి) విదేశీ మదుపరులు అమ్మేసిన స్టాకుల విలువ రూ.1.37 లక్షల కోట్లు. ఇదే.. మార్కెట్ సెంటిమెంట్ ను దారుణంగా దెబ్బ తీసి.. సూచీలు నేలచూపులు చూసేలా చేశాయి. స్టాక్ మార్కెట్ బేర్ మనే పరిస్థితులకు కారణమయ్యాయి.