ఉన్న సీట్లే పదిలం.. ప్రయోగాలు ఎఫెక్టే.. ఏపీ నేతలకు అగ్నిపరీక్షే...!
ఏపీ విషయానికి వస్తే.. ఇటు ప్రతిపక్షం.. అటు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కూడా.. రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఆ ఏముంది.. ఈ సీటు కాకపోతే.. మరోచోట పోటీ చేస్తాం.. గెలుస్తాం. అదెంత పని! అనుకునే నాయకులకు తెలంగాణ ఓటర్లు వాతలు పెట్టారు. సంప్రదాయంగా వస్తున్న సీట్లలోనే అది కూడా.. ఒకరిద్దరు మాత్రమే విజయం దక్కించుకున్నారు. సీటు మారి ప్రయోగాలు చేసిన నాయకులు పత్తాలేకుండా పోయారు. సీఎం కేసీఆర్.. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ సహా.. కామారెడ్డి నుంచి పోటీ చేయగా.. అతిరథ నాయకుడనే సానుభూతి కూడా లేకుండా.. కామారెడ్డి ప్రజలు ఓడించేశారు.
కాంగ్రెస్ నేత, సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రేవంత్ కూడా.. కొడంగల్ సహా కామారెడ్డిలో పోటీ చేయగా .. కొడంగల్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కామారెడ్డి ప్రజలు పక్కన పెట్టారు. ఇక, తన స్థానంతో పాటు.. మరో స్థానంలోనూ ప్రయోగం చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందరకు రెండు చోట్లా ప్రజలు తిరుగు టపా కట్టారు. ఈ ఫలితాలు.. నాయకులకు పెద్ద షాకిస్తున్నాయి. ఉన్న సీట్లే పదిలమని.. ఏమైనా కష్టాలు ఉన్నా.. నష్టాలు ఉన్నా.. అక్కడే తేల్చుకోవాలని సూచిస్తున్నాయి.
ఏపీ విషయానికి వస్తే.. ఇటు ప్రతిపక్షం.. అటు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కూడా.. రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో చంద్రబాబు, నారా లోకేష్ నుంచి అనేక మంది నాయకులు ఉన్నారు. ఇక, ఈ దఫా సీఎం జగన్ కూడా.. పులివెందులతోపాటు.. మరో నియోజకవ ర్గం.. విశాఖ నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా.. పుంగనూరుతోపాటు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు.
అదేవిధంగా జనసేన అధినేత పవన్ కూడా.. తిరుపతి సహా కాకినాడ సిటీ లేదా రూరల్ నియోజకవర్గాల నుంచిపోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ, తెలంగాణలో వచ్చిన ఫలితం తర్వాత.. వీరి భవితవ్యం పైనా.. ప్రజానాడిపైనా, చర్చ వస్తోంది. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. ఖర్చు తప్ప.. ఏమీ లేదని తెలంగాణ ఎన్నికలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ నాయకులు ఉన్న చోటే ప్రజలను మచ్చిక చేసుకుంటారా? లేక.. ప్రయోగాల చుట్టూ పరుగులు దీస్తారా? అనేది చూడాలి.