బొత్స మాస్టారుకు పవన్ స్టూడెంట్
సీనియర్ మంత్రి వైసీపీలో కీలక నేత బొత్స సత్యనారాయణ మాస్టర్ అవతారం ఎత్తారు. ఆయన అసలే విద్యాశాఖ మంత్రి. ఇపుడు విపక్షాలకు ఆయన ట్యూషన్ చెబుతాను అంటున్నారు.
సీనియర్ మంత్రి వైసీపీలో కీలక నేత బొత్స సత్యనారాయణ మాస్టర్ అవతారం ఎత్తారు. ఆయన అసలే విద్యాశాఖ మంత్రి. ఇపుడు విపక్షాలకు ఆయన ట్యూషన్ చెబుతాను అంటున్నారు. అందునా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ణి స్టూడెంట్ గా చేసుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారు.
బైజూస్ మీద పవన్ నిన్నటికి నిన్న కొన్ని ఆరోపణలు చేశారు. ఏ మాత్రం అనుభవం ఏమీ లేని స్టార్టప్ కంపెనీలకు టెండర్లు ఎలా ఇస్తారని ఆయన బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు. దానికి మంత్రి బొత్స జవాబు చెబుతూ వంద కోట్లు దాటిన ప్రతీ టెండర్ పరిధిని అర్హతని హైకోర్టు సమ్మతితో నియమించిన ప్రత్యేక న్యాయమూర్తి ఖరారు చేస్తారని చెప్పారు.
అలాగే టెండర్ల స్పెసిఫికేషన్స్ విషయంలో న్యాయ సమీక్షకు అవకాశం ఇస్తున్న ప్రభుత్వం తనదే అని పేర్కొన్నారు. గూగుల్ లో అన్ని విషయాలూ పూర్తిగా తెలుస్తాయని మంత్రి అంటున్నారు. ఏపీ విద్యారంగంలో అత్యంత పారదర్శకతతో ప్రతీ పనిని నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. ప్రతీ అంశం మీదా ప్రజలను తప్పు దోవ పట్టించడానికి పవన్ చేసే ప్రయత్నాలను చూసి ఆయనకు చదువు చెప్పిన టీచర్లు సిగ్గు పడుతున్నారని బొత్స గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
తాను ఏడు అంశాలు ఆయన లేవనెత్తిన బైజూస్ కి సంబంధించి ఇస్తున్నానని, ఈ ఏడు పాఠాలను అసైన్ మెంట్ గా భావించి పవన్ స్టూడెంట్ బుద్ధిగా చదువుకోవాలని మంత్రి సెటైర్లు వేశారు. ఆ మీదట అవసరం అయిన ట్యూషన్ తాను చెబుతాను అంటున్నారు.
మొత్తానికి చూస్తే మంత్రి బొత్స తన స్టూడెంట్ గా పవన్ని చేసుకున్న్నారు. చదువు చెబుతాను అంటున్నారు. మరి పవన్ స్టూడెంట్ ఆ చదువు నేర్చుకుంటారా మంత్రి గారు చెప్పే పాఠాలు ఆయనకు నచ్చుతాయా అన్నది చూడాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే తాను చెప్పే చదువుని వింటూ హోం వర్క్ కూడా చేస్తాను అని మాట ఇవ్వాలని మాస్టార్ బొత్స కోరుతున్నారు.
ఇదిలా ఉంటే బొత్స ఎపుడూ ఈ తరహా కామెంట్స్ చేసి ఎరగరు. ఇపుడు ఆయన తమాషాతో కూడిన సెటైర్లు వేస్తున్నారు. అది కూడా పవన్ మీదనే. ఇంతకాలం పవన్ని సెలిబ్రిటీ అని ఆయన పార్టీని సెలిబ్రిటీ పార్టీ అని మాటలతో చెడుగుడు ఆడిన బొత్స ఇపుడు ఆయననే స్టూడెంట్ గా చేసుకోవడానికి తపన పడడం విశేషం.
జనసేన అధినేత నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అని ఇతర మంత్రులు గయ్యిమంటూంటే బొత్స మాత్రం డియర్ పవన్ అంటూ నిదానంగా మాట్లాడుతూనే తాను అనాల్సినవి అంటించాల్సినవి అంటించేశారు అని అంటున్నారు. దీంతో ఇపుడు రిప్లై ఇవ్వాల్సినది పవన్. మరి ఆయన బొత్సకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.