ఢిల్లీ సీఎం గా ఆమె ?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తాను అని ప్రకటించారు.

Update: 2024-09-15 15:38 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తాను అని ప్రకటించారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బీజేపీకి రాజకీయంగా అతి పెద్ద దెబ్బ కొట్టాలన్నదే కేజ్రీవాల్ వేసిన మాస్టర్ ప్లాన్. ఆయన జైలు గోడల మధ్యనే అయిదున్నర నెలలుగా నలిగిపోయారు.

ఆయనకు బెయిల్ రావడం కూడా అతి కష్టమైంది. అయినా సరే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు. బీజేపీ ఏది అయితే కోరుకుందో అది మాత్రం కేజ్రీవాల్ చేయలేదు. ఆయన పట్టుదలగానే వ్యవహరించారు. అయితే జైలు బెయిల్ మధ్యన ఉన్న ఆయన మరింతకాలం సీఎం పోస్టులో కూర్చోవడం కంటే తనకు నమ్మకస్థులైన వారిని ఆ సీటులో పెట్టి ఎన్నికలను నాలుగు నెలల ముందుకు జరిపి బిగ్ పొలిటికల్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

నిజానికి చూస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు ఉన్నాయి. దాన్ని ఈ నవంబర్ కి జరిపితే అన్ని విధాలుగా కలిసి వస్తుందని చూస్తున్నారు. అదే సమయంలో జార్ఖండ్ కి మహారాష్ట్రకు ఎన్నికలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో వాతావరణం కూడా ఇండియా కూటమికి అనుకూలంగా ఉంది.

దాంతో కేజ్రీవాల్ ఇపుడే ఎన్నికలు పెట్టించుకుని మరోసారి ఢిల్లీ పీఠం పట్టుకుంటే రాజకీయంగా బీజేపీ మీద పై చేయి సాధించడం ద్వారా దర్జాగా ఆ సీటులో కూర్చోవాలని చూస్తున్నారు. అలా బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇది బీజేపీ ఊహించని ప్లాన్ అని అంటున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీకి మహారాష్ట్ర జార్ఖండ్ లలో ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటి మధ్యలో ఢిల్లీ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం కష్టమే అవుతుంది. పైగా ఇపుడు ఆప్ కే ఢిల్లీ రాజకీయాల్లో ఆదరణ ఉంది. కేజ్రీవాల్ జైలుకి వెళ్లడం వల్ల కూడా సానుభూతి గట్టిగానే ఉంది. దాంతో ఢిల్లీ పీఠం పూర్తి మెజారిటీతో ఆప్ కి దక్కే చాన్స్ అత్యధికంగా ఉంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఢిల్లీ పీఠానికి కేజ్రీవాల్ ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది చర్చగా ఉంది. అయితే ఒక మహిళా మంత్రి పేరు అయితే బాగా ప్రచారంలో ఉంది. ఆమె ఎవరో కాదు అతిషీ అని అంటున్నారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న వేళ ఆమె బీజేపీ మీద ఆడ పులిగా విరుచుకుపడ్డారు. పదునైన తన విమర్శలతో బీజేపీని బాగా నిలువరించ గలిగారు

పైగా కేర్జీవాల్ కి ఆమె అత్యంత నమ్మకస్తురాలు అని అంటున్నారు. ఆమె చేతిలో అయిదు కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయంటే కేజీవాల్ నమ్మకాన్ని ఆమె ఎంతగా చూరగొన్నారు అన్నది అర్ధం అవుతోంది అని అంటున్నారు. ఇక ఆమె రాజకీయంగా సమర్ధవంతంగా ఉంటారని అటు పార్టీని ఇటు ప్రభువాన్ని కో ఆర్డినేట్ చేసుకోగలుగుతారు అని అంటున్నారు.

అదే సమయంలో మరి కొందరు సీనియర్ల పేర్లు కూడా రేసులో ఉనాయి. వారిలో మంత్రి కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. ఈయన కూడా పలు కీలక శాఖలను చూస్తున్నారు. ఆయన చేతిలో న్యాయ, శాసన సభా వ్యవహారాలు, రవాణా, పరిపాలన సంస్కరణలు, ఐటీ, రెవెన్యూ, ఆర్థికం, ప్లానింగ్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.

ఈయన తరువాత చూస్తే సౌరభ్ భరద్వాజ్ ఉన్నారు. ఈయన విజిలెన్స్, సర్వీసులు, ప్రజారోగ్యం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, నీటి పారుదల, వరద నియంత్రణ, మంచినీటి సరఫరా శాఖలను చూస్తున్నారు. ఇక మరో మంత్రి గోపాల్ రాయ్ సైతం కొత్త సీఎం కావచ్చు అంటున్నారు. ఆయన ఢిల్లీ అభివృద్ధి, సాధారణ పరిపాలన, పర్యావరణం, అటవీ శాఖ వంటివి చూస్తున్నారు. ఇలా కేజ్రీవాల్ సైన్యంగా వీరంతా ఉన్నారు. అందరూ ఆయనకు నమ్మకస్తులే. అయితే అందరిలోనూ ఆమెకే చాన్స్ ఎక్కువ అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఢిల్లీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News