నేను 'ఆంధ్రా'వాడిని ఎట్లయిత? కౌశిక్ కు గాంధీ సూటి ప్రశ్న!
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తనను కౌశిక్ రెడ్డి ఆంధ్రావాడు అనడాన్ని గాంధీ గట్టిగా పట్టుకున్నారు.
తెలంగాణ ఉద్యమం జరిగిన రోజుల్లో తీవ్రంగా ఉన్న ‘ఆంధ్రావాడు’ అన్న పదాన్ని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత బయటకు తీశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అనవసర సందర్భంలో ఆయన వాడిన భాష బూమరాంగ్ అయ్యేలా ఉంది. బీఆర్ఎస్ పార్టీ విధానమే ఇదా? అనే ప్రశ్న తలెత్తేలా చేసింది. మరోవైపు శేరిలింగంపల్లి హ్యాటిరక్ ఎమ్మెల్యే అయిన అరికెపూడి గాంధీ.. తనకంటే ఎంతో చిన్నవాడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డితో సవాల్-ప్రతి సవాల్ గా తలపడాల్సి రావడం విచిత్రంగా ఉంది.
నేనెట్ల ఆంధ్రావాడిని?
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తనను కౌశిక్ రెడ్డి ఆంధ్రావాడు అనడాన్ని గాంధీ గట్టిగా పట్టుకున్నారు. ఒక ఎమ్మెల్యేను పట్టుకుని అలా ఎలా అంటారంటూ నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ గనుక దీనికి బాధ్యత వహిస్తే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కౌశిక్ ను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. అపోహలు సమసిపోయి అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని విమర్శించారు.
కౌశిక్ భార్య పూలకుండీలు విసిరారు..
కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తేనే ఆయన ఇంటికి వెళ్లానని గాంధీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వాళ్లు అక్కడ తన అనుచరులపై రాళ్లతో దాడులు చేశారని.. కౌశిక్ భార్య పూలకుండీలు విసిరారని ఆరోపించారు. ఇది బీఆర్ఎస్-గాంధీ మధ్య యుద్ధం కాదని పేర్కొన్నారు. కౌశిక్ బీఆర్ఎస్ లో చేరి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. అతడో మోసకారి.. ప్రాంతీయ విభేదాలు రేపుతున్న అతడి మాటలు ఎంతకాలం నమ్మాలని ప్రశ్నించారు. నిందలు మోయడం కంటే ప్రతిస్పందించడం మేలని భావించినట్లు చెప్పారు.
కౌశిక్ లాంటి వారు ఉంటే బీఆర్ఎస్ ఖాళీ..
కౌశిక్ రెడ్డి వంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉంటే ఈ పార్టీ ఖాళీ కావడం ఖాయమని గాంధీ జోస్యం చెప్పారు. దీనిని గుర్తించి కేసీఆర్ మేల్కొనాలని సూచించారు. కౌశిక్ సమఉజ్జీ కానే కాదని.. అతడి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. హరీశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని.. బీఆర్ఎస్ నేతల మాటలు వారి పార్టీ వైఖరా? వ్యక్తిగత వైఖరా? అని చెప్పాలని అరెకపూడి గాంధీ డిమాండ్ చేశారు.