ఎవరికిఓటేసినా గెలిచేది బీజేపీనే.. అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ మీద ఒంటికాలుపై లేస్తూ.. దీటైన సమాధానం ఇచ్చే అర్వింద్ ఇప్పటికే పలుసార్లు బీఆర్ఎస్ ను ఢీకొట్టారు.
వివాదాస్పద వ్యాఖ్యలు.. తనదైన శైలి విమర్శలకు పేరుగాంచిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదికూడా కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముంగిట.. ఆయన మాటలు పెద్దఎత్తున దుమారం రేపేలా ఉన్నాయి. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ మీద ఒంటికాలుపై లేస్తూ.. దీటైన సమాధానం ఇచ్చే అర్వింద్ ఇప్పటికే పలుసార్లు బీఆర్ఎస్ ను ఢీకొట్టారు. దీంతో అర్వింద్ ఎక్కడ దొరుకుతారా? అని చూస్తున్న బీఆర్ఎస్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ స్థాయిలో ఎన్నికల సంఘం పరిశీలనకు తీసుకెళ్లాలని చూస్తోంది. ఇంతకూ అర్వింద్ ఏమన్నారంటే..
''ప్రజలు ఏ పార్టీకి ఓటేసినా బీజేపీనే నెగ్గుతుంది. మీరు నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తాను. 'కారు' (బీఆర్ఎస్)కు ఓటేసినా నేనే గెలుస్తా. మీరు 'హస్తం' (కాంగ్రెస్)కు ఓటేసినా గెలిచేది 'కమల్' (బీజేపీ)' అని మంగళవారం విలేకరుల సమావేశంలో అర్వింద్ అన్నారు. దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా తీసుకుంది. అసలే అర్వింద్.. తనను ఓడించిన నాయకుడు కావడంతో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత వెంటనే స్పందించారు. అరవింద్ ప్రకటనను సీరియస్ గా తీసుకోవాలని బుధవారం భారత ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ నేతలు ఈ మేరకు వినతిపత్రం అందజేస్తారని తెలిపారు. అయితే, అర్వింద్ విలేకరుల సమావేశంలో తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను అహంకారంతో మాట్లాడలేదని, ప్రజలకు సేవ చేసిన తర్వాతే వచ్చానని చెప్పుకొచ్చారు.
ఈవీఎంల దుర్వినియోగానికి ముడిపెడుతూ..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలను లోతుగా పరిశీలించాలనేది ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఇవ్వనున్న లేఖలోని డిమాండ్. ఎందుకంటే.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ట్యాంపరింగ్ జరుగుతోందంటూ అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇచ్చిన పరిశోధనా పత్రాన్ని కవిత ఉదహరిస్తున్నారు. ఈ పత్రం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోందని పేర్కొంటున్నారు. 'కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎంపీనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. భారత ఎన్నికల సంఘం సీరియస్ గా పరిశీలించాలి'' అని అంటున్నారు.
''రాళ్లేస్తేనే.. బుల్డోజర్లు వస్తాయి..''
ఇటీవలి కాలంలో దేశవాప్తంగా చర్చనీయాంశం అవుతున్ అంశం ఏదైనా నేరం చేసివారి ఇళ్ల పైకి బుల్డోజర్లను పంపడం. ఉత్తరప్రదేశ్ లో మొదలైన ఈ విధానం మధ్యప్రదేశ్, హరియాణాలోనూ సాగుతోంది. నిన్నటి విలేకరుల సమావేశంలో అర్వింద్ ను ఇదే ప్రశ్న అడగ్గా.
రాళ్లు రువ్వితేనే బుల్డోజర్లను ఉపయోగిస్తామని సమాధానమిచ్చారు. కాగా, హరియాణలో ఓ వర్గం వారి ర్యాలీపై కొందరు రాళ్లు రువ్వడం అది హింసకు దారితీయడం, ఆరుగురు చనిపోవడం వంటి పరిణామాలు జరిగాయి. దీంతో నిందితుల ఇళ్లపైకి హరియాణ సర్కారు బుల్డోజర్లను పంపింది. అయితే, అర్వింద్ చేసిన కొన్ని వర్గాలను బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కవిత ఆరోపించారు. వాటిని ఆమె ఖండించారు. ఎన్నికల సంఘం ఈ విషయంలోనూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.