కూకట్ పల్లిలో దుమ్ము రేపాలి.. ఏపీలో అదరగొట్టాలి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరే అసెంబ్లీ స్థానానికి లేని కొత్త ఇమేజ్ ను.. ఇప్పుడు కుకట్ పల్లి సంతరించుకోనుంది

Update: 2023-11-03 04:04 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరే అసెంబ్లీ స్థానానికి లేని కొత్త ఇమేజ్ ను.. ఇప్పుడు కుకట్ పల్లి సంతరించుకోనుంది. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న మాధవరం క్రిష్ణారావుకు టికెట్ కన్ఫర్మ్ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా అనూహ్యంగా తెర మీదకు వచ్చేశారు బండి రమేశ్. మొన్నటివరకు వీరిద్దరు మిత్రులుగా ఉండటమే కాదు.. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మాధవరం గెలుపులో కీలకభూమిక పోషించిన బండి రమేశ్.. ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా మారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

వీరిద్దరి మధ్య నెలకొన్న పోటీ ఇప్పటివరకు పెద్దగా వేడి రాజుకోలేదు. రానున్న కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచారం వేగమందుకున్న కొద్దీ.. వేడి ఆటోమేటిక్ గా రగులుకుంటుందని చెబుతున్నారు. గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మాధవరానికి బాసటగా నిలిచిన కమ్మ సామాజిక వర్గం ఈసారి అందుకు భిన్నంగా బండి రమేశ్ వైపు ఉంటారన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. అదంత తేలికైన విషయం కాదంటున్నారు.

బయటకు చెప్పినంతగా కమ్మ ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్సు లేదన్న మాట వినిపిస్తోంది. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు జనసేన పార్టీ సీన్లోకి వచ్చేసింది. బీజేపీ తరఫున కాకుండా.. ఆ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. ఇప్పటివరకు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ శక్తులు ఇప్పుడు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి కావటం కనిపిస్తోంది.

పార్టీ పరంగా చూస్తే.. జనసేనకు తెలంగాణలో పెద్ద పట్టు లేదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఇవాల్టి వరకు తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగింది లేదు. ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పటం.. తీరా ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన తర్వాత పోటీకి దూరంగా ఉండటం చూస్తున్నదే. కానీ.. అందుకు భిన్నంగా ఈసారి వ్యవహరిస్తున్నారు. బీజేపీతో కలిసి బరిలోకి దిగాలని జనసేన భావిస్తోంది. వాస్తవానికి తొలుత పోటీకి ఆసక్తి చూపినా.. తర్వాత వెనకడుగు వేసిన పరిస్థితి. అయితే.. బీజేపీ అగ్రనాయకత్వం పవన్ తో చర్చలు జరిపిన తర్వాత మాత్రం వ్యూహం మారింది.

పరిమిత సీట్లలో పోటీ చేయటానికి జనసేన ఓకే చెప్పటమే కాదు.. హైదరాబాద్ మహానగర పరిధిలో కీలకమైన కుకట్ పల్లి.. శేరిలింగంపల్లి సీట్ల మీద కన్నేసింది. ఇందుకు తగ్గట్లే.. ఈ రెండు సీట్లకు బీజేపీ తన అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కుకట్ పల్లి బరిలో బలమైన నేతను బరిలోకి దింపాలని జనసేన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు అంగబలం.. అర్థబలం ఉన్న అభ్యర్థిని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.

ఏది ఏమైనా.. కుకట్ పల్లిలో తమ సత్తా చాటాలని.. అనంతరం ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకభూమిక పోషించేందుకు వీలుగా తాజా ఎన్నికల్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏం చేసైనా సరే కుకట్ పల్లిలో దుమ్ము రేపాలని.. ఏపీలో సంచలనాలకు తెర తీయాలన్నదే పవన్ లక్ష్యమని చెబుతున్నారు. ఆశ ఉండటం మంచిదే కానీ.. పార్టీ నిర్మాణం పరిమితంగా ఉన్న చోట.. బలమైన అభ్యర్థుల్ని ఢీ కొని జనసేన ఎలాంటి ఫలితాల్ని నమోదు చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News