ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి రూ.44 లక్షల కోట్లు అవసరం
యుద్ధం అంటే వినాశనం.. ఈ ఆధునిక ప్రపంచంలో యుద్ధం చేసే నష్టం అంతా ఇంతాకాదు.. అభివృద్ధి పయనంలో పోవాల్సిన ఈ సమాజంలో యుద్ధంతో 20 ఏళ్లు వెనక్కి పడిపోతాం.
యుద్ధం అంటే వినాశనం.. ఈ ఆధునిక ప్రపంచంలో యుద్ధం చేసే నష్టం అంతా ఇంతాకాదు.. అభివృద్ధి పయనంలో పోవాల్సిన ఈ సమాజంలో యుద్ధంతో 20 ఏళ్లు వెనక్కి పడిపోతాం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు అదే జరిగింది. ఉక్రెయిన్ యుద్ధ నష్టంతో అత: పాతాళానికి పడిపోయింది. దీంతో ఉక్రెయిన్ పునర్నిర్మాణం అనుకున్నంత ఈజీ కాదు.. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం లక్షల కోట్ల అవసరం.
ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం దాదాపు 524 బిలియన్ డాలర్లు (రూ.44 లక్షల కోట్లు) అవసరమని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇది 2024లో ఉక్రెయిన్ స్థూల దేశీయోత్పత్తి (GDP) కంటే మూడు రెట్లు అధికమని పేర్కొంది. ఇదే అంశాన్ని ఐక్యరాజ్యసమితి (UN), యూరోపియన్ కమిషన్, ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభమై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో దేశంలోని మౌలిక సదుపాయాలపై భారీ విధ్వంసం చోటుచేసుకున్నది. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం, ఉక్రెయిన్ మౌలిక సదుపాయాల్లో దాదాపు 70% వరకు నాశనం అయింది.
- పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు
గత అధ్యయనాల ప్రకారం.. తొలి రెండేళ్ల విధ్వంసం నుంచి కోలుకోవడానికి 486 బిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేశారు. కానీ గడిచిన ఏడాదిలో మరింత నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ ప్రధానంగా హౌసింగ్, రవాణా, ఎనర్జీ, విద్య, వాణిజ్య రంగాల్లో తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరానికి గాను ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు 7.37 బిలియన్ డాలర్లు కేటాయించినట్లు ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహల్ తెలిపారు. అయితే ఇంకా 10 బిలియన్ డాలర్ల కొరత ఉందని పేర్కొన్నారు.
- ప్రధాన నష్టాలు
ఉక్రెయిన్‌లో 13% గృహ సముదాయాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంటే సుమారు 2.5 మిలియన్ గృహాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఎనర్జీ రంగంలో ధ్వంసమైన ఆస్తులు గత ఏడాదిలోనే 70% పెరిగాయి.
* ఇతర రంగాల్లో జరిగిన నష్టం ఇలా ఉంది:
-హౌసింగ్ సెక్టార్: 84 బిలియన్ డాలర్లు
- రవాణా రంగం: 78 బిలియన్ డాలర్లు
-ఎనర్జీ అండ్ మైనింగ్: 68 బిలియన్ డాలర్లు
-పరిశ్రమలు, వాణిజ్య రంగం: 64 బిలియన్ డాలర్లు
- వ్యవసాయ రంగం: 55 బిలియన్ డాలర్లు
కేవలం ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించేందుకు కూడా 13 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.
- ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ సహాయం
ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సహాయం అందిస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర పశ్చిమ దేశాలు ఆర్థిక, సాంకేతిక మద్దతును అందిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్‌లో పునర్నిర్మాణ ప్రక్రియ మరింత వేగంగా జరగాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరం. రష్యా దాడుల ప్రభావం నుండి కోలుకుని, దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ప్రపంచ సమాజం నుంచి మరిన్ని సహాయాలు అవసరమని ఉక్రెయిన్ ప్రభుత్వం అభిప్రాయపడింది.