ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ.. సీఎం రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్షేనా..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు 13 నెలలు అవుతుంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు 13 నెలలు అవుతుంది. ఈ పరిస్థితుల్లో చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకునేందుకు నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. యువ నేతల నుంచి సీనియర్ల వరకు అంతా తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ లో ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్నా.. ఢిల్లీ హైకమాండ్ అంగీకారం ఉండాల్సిందే.. ఈ పరిస్థితుల్లో తనను నమ్ముకున్న వారికి పదవులు ఇప్పించుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ గా మారుతోందంటున్నారు.
సీఎంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి సుమారు 13 నెలలు అవుతున్నా, కొన్ని కీలక రాజకీయ నియామకాలు చేపట్టలేని పరిస్థితి ఉందంటున్నారు. ప్రధానంగా మంత్రివర్గంలో ఆరు ఖాళీలను భర్తీ చేయడం ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అటు కాంగ్రెస్ హైకమాండ్ కు తలకు మించిన భారంగా తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవుల కోసం పట్టుబడుతున్న డజను మంది నేతలను సర్ది చెప్పలేక ఎప్పటికప్పుడు మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేసుకుంటూనే వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకుని మంత్రివర్గ రేసులోకి దూసుకొచ్చేందుకు పలువురు సీనియర్లు ప్రయత్నిస్తుండటంతో రాజకీయం మరింత రంజుగా మారుతోందని అంటున్నారు. ఈ పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరింత ఇరకాటం కానుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితులను చక్కదిద్దాలంటే పార్టీలో యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలని హైకమాండ్ అభిప్రాయపడుతోంది. అగ్రనేత రాహుల్ ఆలోచన ప్రకారం వచ్చే 20 ఏళ్లు పనిచేయగలిగే నేతలకే అవకాశాలు ఇవ్వాలని అంటున్నారు. దీంతో 60 ఏళ్లు పైబడిన వారికి దాదాపుగా అవకాశాలు లేనట్లే చెబుతున్నారు. అయినప్పటికీ చాలా మంది నేతలు రేసులో ఉన్నామంటూ ముందుకు వస్తుండటంతో టీపీసీసీ ఇరకాటంలో పడుతోంది. ప్రధానంగా సిట్టింగు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీనియర్ నేత వీ.హనమంతురావు, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ వంటివారు పదవుల కోసం ఆరాటం చూపడం యువనేతలను ఆందోళనకు గురిచేస్తోంది.
సిట్టింగు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కోటా ఆలోచనతోనే పోటీ చేయలేదని చెబుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆయనకు అవకాశం ఇచ్చినా గెలవలేకపోయారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం కోరుతుండటం, పైగా లాస్ట్ చాన్స్ అని చెప్పడం కాంగ్రెస్ లో చర్చకు దారితీస్తోంది. ఇదేవిధంగా గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, సునీతారావు సైతం ఎమ్మెల్సీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మైనార్టీ ఎమ్మెల్యే ఒకరు కూడా లేరు. దీంతో ఎమ్మెల్సీగా గతంలోనే మైనార్టీ నాయకుడిని ఎమ్మెల్సీగా నియమించింది. ఇప్పుడు మళ్లీ మైనార్టీ కోటాలో ముగ్గురు పోటీపడుతుండటం ఆసక్తి రేపుతోంది.
మరోవైపు యువత కోటాలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన అద్దంకి దయాకర్, పటేల్ రమేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరూ ఉమ్మడి నల్గొండ జిల్లా వారే.. పటేల్ రమేశ్ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేద్దామని ప్రయత్నించారు. ఆయన సీటుకు సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి గండికొట్టారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఇస్తామని పార్టీ ఆఫర్ ఇచ్చింది. కానీ, ఈ సారి సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి తన్నుకుపోయాడు. ఇలా ప్రతిసారి రమేశ్ రెడ్డికి అన్యాయం జరుగుతున్నందున ఆయనకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. కానీ, రెడ్డి సామాజికవర్గం నుంచి మరికొందరు రేసులో ఉండటంతో తన అనుచరుడికి ఎలా న్యాయం చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
అదేవిధంగా యువనేత సామ రామ్మోహన్ రెడ్డి, ఉస్మానియా విద్యార్థి నేత చరణ్ కౌశిక్ వంటివారు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రౌడ్ పుల్లర్స్ గా భావించే నేతలకే అవకాశం ఇస్తూ వస్తోంది. తీన్మార్ మల్లన్న, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వంటివారికి పదవులు ఇవ్వడం వెనుక వారి వయసు, జనసమీకరించే సత్తా వంటివి పరిగణించారని అంటారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా, అనిల్ కుమార్ యాదవ్ జనసమీకరణకు చాలా శ్రమపడ్డారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు తొలి అవకాశం ఇచ్చారంటున్నారు. ఈ పరిస్థితుల్లో యువనేతలు ఇంద్రసేనారెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డితోపాటు చాలా మంది ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారని చెబుతున్నారు. దాదాపు 20 మంది నేతలు ఎమ్మెల్సీ పదవులకు పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.