ముగ్గురు ఫైనల్.. మిగిలిన ఇద్దరు ఎవరన్నదే సస్పెన్స్!
ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ముగ్గురు అభ్యర్థులు దాదాపు ఫైనల్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది.
ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ముగ్గురు అభ్యర్థులు దాదాపు ఫైనల్ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది. మొత్తం ఐదు ఖాళీలు ఉండగా, అన్ని స్థానాలు కూటమి దక్కించుకునే అవకాశం ఉంది. మిత్రపక్షాల్లో జనసేనకు ఒక సీటు కేటాయించనుండగా, ఆ సీటు నుంచి మెగా బ్రదర్ నాగబాబు ఫైనల్ అంటున్నారు. ఇక బీజేపీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా? లేదా? అన్నదే సస్పెన్స్ గా మారింది. అదేవిధంగా టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు దాదాపు ఖరారు అయ్యాయంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరు ఎవరన్నదే ఉత్కంఠ రేపుతోంది.
ఏపీ ఎమ్మెల్సీ రేసు ఎన్డీఏ కూటమిలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి పదవులకు తొలిసారి ఎన్నిక జరుగుతుంది. దీంతో ఆరేళ్ల పదవీకాలం ఆశిస్తున్న నేతలు పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలనలో కొందరి పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, మెగా బ్రదర్ నాగబాబు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఇక మిగిలిన రెండింటిని టీడీపీ తీసుకుంటుందా..? లేక బీజేపీకి ఓ స్థానిమిస్తుందా? అనేది చర్చకు తావిస్తోంది.
టీడీపీలో రెండు స్థానాలకు విపరీతమైన పోటీ ఉండగా, బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడే చట్టసభలో అడుగుపెట్టే అవకాశం దక్కించుకోవాలని తహతహలాడుతున్నారు. ఆ పార్టీలో సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు, పాతూరి నాగభూషణం, పీవీఎస్ మాధవ్ ఇలా చాలా మంది నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పార్టీ అగ్ర నేతల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తడి తేవాలని వారు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఎవరికి అవకాశం ఇవ్వాలన్నా మూడు పార్టీలు కలిపి సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల్సివుంటుందని అంటున్నారు.
దీంతో ఓసీ సామాజికవర్గం నుంచి వర్మ, కాపు సామాజికవర్గం నుంచి నాగబాబు, బీసీ మత్స్యకార సామాజికవర్గం నుంచి మోపిదేవి పేర్లు దాదాపు ఖరారైనందున ఆయా సామాజికవర్గాలు జిల్లాల నుంచి వేరొకరికి అవకాశం దక్కదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఉభయ గోదావరి, క్రిష్ణా డెల్టా ప్రాంతం నేతలు గవర్నర్ కోటాలో ఖాళీ అయ్యే స్థానాల కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఉందంటున్నారు. దీంతో రాయలసీమ జిల్లాలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కోటాలో నేతలు ఎమ్మెల్సీ చాన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా రాయలసీమలో ఎప్పుడూ లేనన్ని సీట్లు గెలుచుకున్నా, ఆ ప్రాంతంలో బలమైన స్థితికి చేరుకోవాలంటే నాయకత్వాన్ని ఇంకా పటిష్టం చేసుకోవాలనే ఆలోచనతో టీడీపీ, జనసేన అగ్రనేతలు ఆలోచనగా చెబుతున్నారు. దీంతో రాయలసీమకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలకు అవకాశాలు దక్కే పరిస్థితి ఉందంటున్నారు. మొత్తానికి ఐదు ఎమ్మెల్సీల్లో రెండింటిపైనా ఎక్కువ సస్పెన్స్ కొనసాగుతోందంటున్నారు.