250 డాలర్ల నోట్లపై డొనాల్డ్ ట్రంప్ బొమ్మ.. ఇదేం విడ్డూరం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అగ్రరాజ్యానికి చక్రవర్తిలా భ్రమిస్తున్నట్టున్నారు.

Update: 2025-02-26 14:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అగ్రరాజ్యానికి చక్రవర్తిలా భ్రమిస్తున్నట్టున్నారు. అందుకే ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. వెనుకటికి చక్రవర్తులు నాణేలపై తమ బొమ్మను పెట్టుకుంటున్నట్టుగా ట్రంప్ కూడా ఏకంగా అమెరికా కరెన్సీపై తన బొమ్మను పెట్టుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం.

అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోరు కొనసాగుతోంది. తాజాగా, ట్రంప్‌ చిత్రంతో 250 డాలర్ల నోటును ముద్రించాలని ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు జో విల్సన్‌ ఈ చట్టాన్ని ప్రతిపాదించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

- ద్రవ్యోల్బణమే కారణం!

జో విల్సన్‌ తన ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్యమైన కారణాన్ని వెల్లడించారు. బైడెన్‌ పాలనలో ఏర్పడిన ద్రవ్యోల్బణమే తనకు ఈ ఆలోచనకు ప్రేరేపించిందని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో ప్రజలు భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అధిక ధరల కారణంగా వారి అవసరాలు తీరడం కష్టమవుతోందని ఆయన వివరించారు. ట్రంప్‌ను అత్యంత విలువైన అధ్యక్షుడిగా అభివర్ణిస్తూ, 250 డాలర్ల నోటుపై ఆయన బొమ్మను ముద్రించాలని బ్యూరో ఆఫ్‌ ఎన్‌గ్రేవింగ్‌ అండ్‌ ప్రింటింగ్‌ ను సూచిస్తూ ఈ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

- సోషల్‌మీడియాలో విభిన్న స్పందనలు

ఈ ప్రతిపాదనపై సోషల్‌మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ట్రంప్‌ అభిమానులు దీనిని స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు. "అసలు 250 డాలర్ల నోటు ఉపయోగిస్తామా?", "ఇదేనా అత్యవసరమైన విషయం?", "ఇందుకేనా మేము ట్రంప్‌కు ఓటేసింది?" అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే, ట్రంప్‌ను గౌరవించడానికి ఇదే సరైన మార్గమని జో విల్సన్‌ సమర్థించుకున్నారు.

- చట్టసభల్లో ట్రంప్ బలం పెరుగుతుందా?

ఇక మరోవైపు, ట్రంప్‌ తన రాజకీయ బలాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఇటీవల అమెరికా చట్టసభలో ఆయన ప్రధాన అజెండా అయిన కీలక బిల్లును 2017-215 ఓట్ల తేడాతో ఆమోదించారు. ఈ బిల్లులో పన్ను చట్టంలో మార్పులు, కఠినమైన ఇమిగ్రేషన్‌ పాలసీ, కొత్త ఇంధన వనరుల అన్వేషణకు డ్రిల్లింగ్‌, జాతీయ భద్రత కోసం భారీగా ఖర్చు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ నిర్ణయాలు అమెరికా రాజకీయాలలో మరింత చర్చనీయాంశంగా మారాయి.

-ట్రంప్ ఫొటో ముద్రిస్తే ఏమవుతుందో?

250 డాలర్ల నోటుపై ప్రతిపాదన ఎంతవరకు అమలులోకి వస్తుందో చూడాలి. ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు దీని అవసరాన్ని ప్రశ్నిస్తుండగా, ట్రంప్‌ అనుచరులు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. ఈ చట్టం చట్టసభలో ఎంత వరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News