లోకేష్ పట్టాభిషేకానికి ఇదే ముహూర్తమా ?
అలా ఈ ఎన్నికల వరకూ జరిగినా దీర్ఘ కాలంలో మాత్రం టీడీపీకి యూత్ ఫేస్ అవసరం అన్నది చాలా మంది చెప్పే మాటే.
తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం అవసరం అన్నది తెలిసిందే. 2019, 2024 ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్లుగా కనిపించింది. జనసేన అధినేత పవన్ పొత్తు కలపడంతో యూత్ అంతా టీడీపీ కూటమి వైపు మళ్లారు. అలా ఈ ఎన్నికల వరకూ జరిగినా దీర్ఘ కాలంలో మాత్రం టీడీపీకి యూత్ ఫేస్ అవసరం అన్నది చాలా మంది చెప్పే మాటే.
ఎన్ని ఎన్నికలు అయినా కత్తి పట్టి యుద్ధ రంగంలో నిలిచేది మాత్రం చంద్రబాబే. ఆయన తాజా ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలలో 46 డిగ్రీల ఎండలను సైతం ధిక్కరించి చేసిన ప్రచారం చూసిన వారు బాబు తెగువను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. దటీజ్ బాబు అని కొనియాడారు. కానీ అదే సమయంలో టీడీపీలో ఏడున్నర పదుల వయసులో బాబు ఒక్కరే ఇంత కష్టపడాలా అన్న చర్చ కూడా వచ్చింది.
ఆయన ఈ వయసులో కొన్ని కీలక సభలను అడ్రస్ చేసి మిగిలిన బాధ్యతలను లోకేష్ కి అప్పగించి ఉండాల్సిని అని కూడా అన్నారు. కానీ ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు కాబట్టే బాబు అలా ఆలోచించలేదని అంటున్నారు. అయినా ఎంతకాలం బాబు టీడీపీ బరువు మోస్తారు అన్న ప్రశ్న కూడా ఉంది. లోకేష్ సైతం జనంలో ఉంటున్నారు. 2019తో పోలిస్తే ఆయన బాగానే గత అయిదేళ్లలో మమేకం అయి ప్రజలలో తిరిగారు.
మరి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు కదా అన్న చర్చకు తెర లేస్తోంది. అదే మాటను ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కూడా అనేశారు. పైగా ఆయన తాను బాబుని రిక్వెస్ట్ చేయడం లేదు, డిమాండ్ చేఅస్తున్నాను అని కూడా అన్నారు.
లోకేష్ కి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి బాబు ముఖ్యమంత్రిగా ఉండాలని బుద్ధా వెంకన్న సూచించారు. ఆయన డిమాండ్ వెనక వ్యూహం కూడా ఉంది. లోకేష్ ని ఎటూ మంత్రిగా చేస్తారో లేక ఈక్వేషన్స్ తో పక్కన పెడతారో తెలియదు. చంద్రబాబు సీఎం గా ఉంటే చాలా మందికి మంత్రులుగా చాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో బాబు ప్రభుత్వంలో ఉంటూ లోకేష్ కి పార్టీ పగ్గాలు ఇస్తే జోడెద్దుల మాదిరిగా అటు ప్రభుత్వం ఇటు పార్టీ సాఫీగా పరుగులు తీస్తాయన్న భావన ఉంది.
అయితే టీడీపీలో జూనియర్ లీడర్ల నుంచే ఎక్కువగా ఈ డిమాండ్ వస్తోంది. సీనియర్లు మాత్రం బాబే 2029 దాకా టీడీపీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారు. పార్టీని నడపడం అంటే అంత ఈజీగా కాదు, ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక ఎత్తు అధికారంలో ఉన్నపుడు మరో ఎత్తుగా ఉంటుంది. రెండూ కత్తి మీద సాములే. టీడీపీ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ సవాల్ వేరేగా ఉంటుంది. సోలోగా మెజారిటీ సాధిస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది.
ఏది ఏమైనా లోకేష్ సాయం తీసుకోవాల్సిందే. ఆయనకు పగ్గాలు అప్పగించాల్సిందే. కానీ దానికి సరైన ముహూర్తం ఇదేనా అంటే కాదు అనే అంటున్నారు ఎక్కువ మంది. రాజకీయ విశ్లేషకులు సైతం కొన్నాళ్ల పాటు బాబు అనుభవం పార్టీకి ప్రభుత్వానికి అవసరం అనే అంటున్నారు. అయితే లోకేష్ కి మరింత ఎక్కువగా స్వేచ్చను ఇచ్చి ఆయనను పార్టీ పరంగా ముందుకు సాగేలా చేయవచ్చు అని అంటున్నారు. ఇంతకీ బాబు మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. కానీ తొలి డిమాండ్ మాత్రం ఫైర్ బ్రాండ్ నేత బుద్ధా వెంకన్న వైపు నుంచి వచ్చింది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.