ఆశలు సన్నగిల్లిన వేళ... ర్యాట్ హోల్ మైనర్స్ ఎంట్రీ!
దీంతో.. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయచర్యల్లో నిమగ్నమయ్యాయి.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్.ఎల్.బీ.సీ) సొరంగంలో శనివారంపై కుప్ప కూలడంతో ఎనిమిది మంది లోపల చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో.. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయచర్యల్లో నిమగ్నమయ్యాయి.
అయితే... సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందేందుకు ఇప్పటివరకూ చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. మరోవైపు.. ఇంకో రెండు రోజులు పట్టొచ్చనే మాటలూ వినిపిస్తున్నాయి. ఎన్.డీ.ఆర్.ఎఫ్., ఎస్.డీ.ఆర్.ఎఫ్., ఆర్మీ తదితర బృందాలు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది!
మొత్తం అంతా బురదమయంగా ఉండటం, టీబీఎం యంత్రం పైభాగం కుంగిపోవడం.. దాంతోపాటు ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండటంతో ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో.. లోకో ట్రైన్ రాకపోకలకు 9వ కిలోమీటర్ వద్ద అంతరాయం కలిగింది. టన్నెల్లో 11వ కి.మీ. నుంచి 2 కి.మీ. మేర భారీగా నీరు నిలిచిపోయింది.
ప్రధానంగా సంఘటన చోటుచేసుకున్న ప్రాంతం నుంచి మూడు కి.మీ. వెనక్కు బురద, నీళ్లు ఎగదన్నాయని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే వెళ్లడించగా.. ఆ నీటిని మోటార్లు పెట్టి ఎత్తిపోస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలిస్తున్నారు. దీనికోసం ఐదు హైకెపాసిటీ ఉన్న పంపులను వినియోగిస్తున్నారు.
రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్లు!:
ఇలా పరిస్థితి మరింత జఠిలంగా మారిందని అంటున్న వేళ, ఆశలు సన్నగిల్లుతున్నాయనే మాటలు వినిపిస్తున్న వేళ రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్లు దిగారు. ఇందులో భాగంగా... ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్లు టన్నెల్లో చిన్నుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
2023లో ఉత్తరకాశీ సొరంగం దుర్ఘటన జరిగిన సమయంలో సుమారు 27 రోజుల సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఒకే ఒక్క రోజులో 41 మందిని బయటకు తీసుకొచ్చింది ఈ హోల్ మైనర్ల టీమే! అలాంటి అతిక్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేయగలిగిన ర్యాట్ హోల్ మైనర్లను టన్నెల్లో చిక్కుకున్న వారికోసం రంగంలోకి దింపారు.
వీరి పనితీరు భిన్నంగా ఉంటుందని అంటారు. వీరు ఒక చిన్న రంద్రాన్ని చేసి పక్కనుంచి తవ్వుకుంటూ లోపలికి వెళ్లి ఖచ్చితమైన దారి తెలుసుకున్న తర్వత, అదే రంద్రాన్ని పెద్దది చేస్తూ బయటకు వచ్చేలా చేస్తారు. ఈ నేపథ్యంలో టన్నెల్లో చిక్కుకున్నవారిని వీరు క్షేమంగా బయటకు తీసుకొస్తారా లేదా అనేది వేచి చూడాలి. తీసుకురావాలని కోరుకుందామ్..!!