కమ్యునికేషన్స్ వ్యవస్థకు టెన్షన్... అండర్ సీ కేబుల్స్ పై దాడి!
ఇందులో భాగంగా సముద్రగర్భ కేబుల్స్ పై హౌతీలు దాడి చేసినట్లు అనుమానాలు బలపడుతున్నాయని తెలుస్తుంది.
ఇప్పటికే ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడికి పాల్పడుతున్న ఘటనలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరో ఆందోళన కలిగించే విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా సముద్రగర్భ కేబుల్స్ పై హౌతీలు దాడి చేసినట్లు అనుమానాలు బలపడుతున్నాయని తెలుస్తుంది. దీంతో... సరికొత్త టెన్షన్ తెరపైకి వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... ఈ ప్రపంచ కమ్యునికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుల్స్ వ్యవస్థపై హౌతీలు దాడులు మొదలుపెట్టి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ - బ్రిటన్ మధ్య ఉన్న కమ్యునికేషన్ లైన్స్ తో పాటు మరో నాలుగింటిపైనా వీరు దాడులు చేసినట్లు కథనాలు వెలువడుతున్నాఇ. వీటిలో భారత్ - ఐరోపా మధ్య సేవలు అందించేవి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదే క్రమంలో... యెమన్ తీరంలోని జలాల అడుగు నుంచి పరిచిన నాలుగు కమ్యునికేషన్ కేబుల్స్ ఈ దాడుల్లో దెబ్బతిన్నాయని తెలుస్తున్న నేపథ్యంలో... వీటిలో ఒక దానిని నిర్వహించే సంస్థ ఈ విషయంపై ఇప్పటికే స్పందించింది. వస్తున్న కథనాలను ధృవీకరించింది. ఇదే సమయంలో నొత్తం నాలుగు లైన్లు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి!
ఇందులో భాగంగా... ఈజిప్ట్ మీదుగా తూర్పు ఆసియాను ఐరోపాతో అనుసంధానించడంతోపాటు.. ఖతర్, పాకిస్థాన్ మీదుగా చైనాను పశ్చిమ దేశాలతో కలిపే "ఏఏఈ-1 కేబుల్" దెబ్బతిందని అంటున్నారు. అదే విధంగా.. భారత్ తో పాటు ఈజిప్ట్, జిబూటి, సౌదీ, యూఏఈ లకు ఐరోపా ప్రాంతాల మీదుగా కమ్యునికేషన్స్ అందించే "యూరప్ ఇండియా గేట్ వే (ఈఐజీ) కేబుల్" కూడా దెబ్బతిన్నవాటిలో ఉందని చెబుతున్నారు.
ఇదే క్రమంలో... ఐరోపా, ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, భారత్ లను అనుసంధానించే సీకాం కేబుల్, దానితో కలిసి పనిచేసే టాటా కమ్యూనికేషన్స్ లకు సంబంధించిన కేబుల్స్ కూడా దెబ్బతిన్నాయని అంటున్నారు!! ఈ సమయంలో సమస్య తెలిసినా.. లోపాలను కచ్చితంగా చెప్పలేకపోతున్నామని చెబుతున్న ఆయా సంస్థలు... మరమ్మత్తు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరమ్మత్తులకు కనీసం 8 వారాల సమయం పట్టొచ్చని చెబుతున్నారు.
ఏమిటీ సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్స్?
అట్లాంటిక్ టెలిగ్రాఫ్ కంపెనీ తొలిసారిగా 1858లో తొలిసారిగా సముద్రగర్భంలో కేబుల్స్ ని వేసింది. దీంతో అంతర్జాతీయ కమ్యునికేషన్స్ తో పాటు ఆర్ధిక వ్యవస్థకు ఇది కీలకంగా మారింది. ఇప్పుడు వీటి సంఖ్య సుమారు 300కి చేరిందని అంటున్నారు. ఇంటర్ నేషనల్ ఫోన్ కాల్స్, డైలీ జరిగే బిలియన్ డాలర్ల కొద్దీ అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు వంటివి వీటి నుంచే జరుగుతుంటాయి.