మహారాష్ట్రను ఊపేస్తోన్న ఔరంగజేబ్ రాజకీయ వివాదమేంటి?

ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కొంతమంది ఔరంగజేబ్‌ను అతిపెద్ద మతతత్వ పాలకుడిగా అభివర్ణిస్తుంటే, మరికొందరు అతని పరిపాలనా విధానాన్ని సమర్థిస్తున్నారు.;

Update: 2025-03-10 23:30 GMT

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చరిత్రను గురించి ప్రతిసారి కొత్త వివాదాలు చెలరేగుతూనే ఉంటాయి. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సమాజ్వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే అబు అజ్మీ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన "ఔరంగజేబ్ పాలనలో ప్రపంచ జీడీపీలో మన దేశ వాటా 24శాతంగా ఉంది. అప్పుడు భారతదేశాన్ని బంగారు పిచ్చుక అని పిలిచేవారు. ఔరంగజేబ్ అనేక ఆలయాలు నిర్మించాడు" అంటూ మాట్లాడారు.

- ఔరంగజేబ్ పై వచ్చిన విమర్శలు

ఔరంగజేబ్ పాలనకు సంబంధించిన వివాదాలు కొత్తవి కావు. అతను హిందూ దేవాలయాలను ధ్వంసం చేసాడనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించాడని, హిందూ రాజులను తీవ్రంగా దెబ్బతీశాడని విమర్శలు ఉన్నాయి. అలాగే తన సొంత కుటుంబ సభ్యులను, సహోదరులను హత్య చేయించాడని, తన తండ్రిని (షాజహాన్) కాజీపట్టిన ఖైదులో ఉంచాడని కథనాలు ఉన్నాయి. ఈ కారణంగా అతని పాలనను సంప్రదాయ వాదులు, హిందుత్వవాదులు తీవ్రంగా విమర్శిస్తుంటారు.

- రాజకీయ ప్రభావం

ఔరంగజేబ్ గురించి అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిందే వర్గం) నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకతకు గురయ్యాయి. ఆయన వ్యాఖ్యలను భాజపా నేతలు భారతీయ సంస్కృతిని అవమానించేలా ఉన్నాయని, అతను చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఔరంగజేబ్‌ నీచచరిత్ర ను తెలుసుకోవాలని.. చరిత్రను వక్రీకరించవద్దని.. అతడి కూరత్వాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

2015లో ఔరంగాబాద్ నగరాన్ని సంబాజీనగర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. ఇది మరాఠా సామ్రాజ్యపు సంబాజీ మహారాజ్ పేరు మీదకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అయితే ఈ మార్పు వివాదాస్పదంగా మారింది. ఇటీవలి కాలంలో ఔరంగజేబు సమాధి చుట్టూ కూడా వివాదాలు చోటుచేసుకున్నాయి, కొన్ని సమూహాలు అతని సమాధిని తొలగించాలనే డిమాండ్ చేశారు. ఈ వివాదాలు మహారాష్ట్రలో మతపరమైన, రాజకీయ అంశాలపై చర్చలకు దారితీశాయి.

-సామాజిక వర్గాల ప్రతిస్పందన

ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కొంతమంది ఔరంగజేబ్‌ను అతిపెద్ద మతతత్వ పాలకుడిగా అభివర్ణిస్తుంటే, మరికొందరు అతని పరిపాలనా విధానాన్ని సమర్థిస్తున్నారు. అయితే భారతీయ చరిత్రకారులు కూడా ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఔరంగజేబ్‌ను క్రూరుడైన పాలకుడిగా, మతపరమైన అసహనం కలిగిన చక్రవర్తిగా పేర్కొనగా మరికొందరు అతన్ని పరిపాలనా పరంగా చారిత్రక ఆధారాలు ఖచ్చితమైనవి లేవని అభివర్ణిస్తున్నారు.

ఔరంగజేబ్ చరిత్ర ఎంత వివాదాస్పదమైనదో, అతనిపై రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు అతనిని దేశానికి నష్టం చేసిన చక్రవర్తిగా అభివర్ణిస్తుంటే, మరొకవైపు అతను దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేశాడని కొన్ని వర్గాల వారు పేర్కొంటారు. కానీ, చరిత్రను రాజకీయ అవసరాలకు అనుగుణంగా వక్రీకరించకూడదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చారిత్రక అంశాలను అధ్యయనం చేసి, వాస్తవాలను తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయ వివాదాల్లో పరణతిగా రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News