క్యాడర్ మనోగతం అయ్యన్న చెప్పేశారా ?
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్యాడర్ నుంచి లీడర్ గా ఎదిగిన వారు.
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్యాడర్ నుంచి లీడర్ గా ఎదిగిన వారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆయన ఈ దఫా మంత్రి కాలేకపోయారు అన్న బాధతో కొంత ఉంటున్నా స్పీకర్ గా తనదైన శైలిలో పనిచేస్తున్నారు.
ఆయన తాజాగా ఒక కీలక సూచనను కూటమిలోని తెలుగుదేశం బీజేపీ జనసేనల పార్టీలకు ఇచ్చారు. వైసీపీ నుంచి నేతలు ఎవరూ వచ్చినా చేర్చుకోవద్దు అంటూ అయ్యన్నపాత్రుడు కార్యకర్తల చప్పట్ల మధ్య ఆమోదం తీసుకుని మరీ కూటమి పెద్దలకు వినిపించారు.
గత అయిదేళ్ళుగా ఏపీలో వైసీపీ నేతలు అరాచకాలను అడ్డుకుని కూటమి పార్టీల కార్యకర్తలు ఇబ్బందుల పాలు అయ్యారని ఇపుడు వారినే తిరిగి పార్టీలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఆయన తాజాగా అనకాపల్లిలోని కశింకోటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తన సూచనలు ఎవరైనా ఇష్టపడితే చప్పట్లు కొట్టాలని చెబితే క్యాడర్ మొత్తం కొట్టారు
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వైసీపీ నుంది ఎంతో మంది నేతలు మూడు పార్టీలలో చేరుతున్నారు. అధికారంలో ఉంది కాబట్టే కూటమి వైపు వైసీపీ నేతలు వస్తున్నారు అని అంటున్నారు. అయిదేళ్ల పాటు వారి మీద పోరాటం చేసిన టీడీపీ కూటమి నేతలు వారు తమ వైపే వచ్చి అధికారంలో వాటాను అందుకోవడానికి చూడడంతో ఇబ్బంది పడుతున్నారు. వారి మానసిక స్థైర్యం దెబ్బ తింటోంది అని ప్రచారం సాగుతోంది. కొన్ని చోట్ల ఎమ్మెయే స్థాయిలలో కూడా వైసీపీ నుంచి వచ్చిన వారిని చేర్చుకోవద్దు అంటూ విన్నపాలు అధినాయకత్వానికి వెళ్తున్నాయి.
అయితే వాటిని కాదని చేర్చుకుంటున్నారు అని అంటున్నారు. దాంతో టీడీపీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉంటూ కష్ట కాలంలో భుజం కాసిన నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడు వంటి వారు ఇపుడు ఈ తరహా సూచనలు చేస్తున్నారు క్యాడర్ మనసు ఎరిగి ఆయన ఇలా మాట్లాడారు అని అంటున్నారు.
మరి అయ్యన్నపాత్రుడు సూచనలను కూటమి పార్టీలు పట్టించుకుంటాయా ఎంత వరకూ దీని మీద ఆలోచిస్తాయన్నది కూడా చర్చకు వస్తున్న విషయంగా ఉంది. మొత్తానికి చూస్తే కనుక వైసీపీ నేతలు ఇప్పటికే చాలా మంది కూటమిలో చేరారు. ఇంకా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని చేర్చుకోవద్దు మనమే అయిదేళ్ల పాటు ప్రశాంతంగా పరిపాలన చేసుకుందామని అయ్యన్న ఇచ్చిన పిలుపుని కూటమి పార్టీల క్యాడర్ మాత్రం ఆహ్వానిస్తోంది. దీని మీద ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అధినాయకత్వమే అని అంటున్నారు. చూడాలి మరి ఏ విధంగా ముందుకు సాగుతారో.