గట్టిగా కొట్టటం అలవాటు.. కేసీఆర్ నోట మాటల వెనుక అసలు లెక్క ఇదేనా?
రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే అన్న మాట ఉత్తనే అనలేదు. తమకు తాము ఒప్పులు చేయకున్నా.. ప్రత్యర్థులు చేసే తప్పులు.. వరాలుగా మారుతుంటాయి. చేతికి అధికారాన్ని తెచ్చి ఇస్తుంటాయి.
రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే అన్న మాట ఉత్తనే అనలేదు. తమకు తాము ఒప్పులు చేయకున్నా.. ప్రత్యర్థులు చేసే తప్పులు.. వరాలుగా మారుతుంటాయి. చేతికి అధికారాన్ని తెచ్చి ఇస్తుంటాయి. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. గ్రౌండ్ లెవల్ లో కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఇమేజ్ ఉందన్న విషయంపై సరైన మదింపు లేకుండా ఇప్పుడు ఎదురైన చేదు అనుభవాలే ఎదురవుతాయి. పద్నాలుగు నెలలుగా ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికి మౌనంగా ఉన్న కేసీఆర్.. ఒక్కసారిగా తెర మీదకు రావటమే కాదు.. తనది గంభీరమైన మౌనంగా అభివర్ణిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఫామ్ హౌస్ పాలన కావాలా? ప్రజాపాలన కావాలా? అంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ సంధించిన ప్రశ్నకు అత్యధికులు ఫామ్ హౌస్ పాలనే తమకు ముద్దు అంటూ వ్యాఖ్యానించటం.. ఆ వివరాలు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు టానిక్ గా మారాయంటున్నారు. గడిచిన పద్నాలుగు నెలలుగా గులాబీ బాస్ ను ఫామ్ హౌస్ లో ఉన్న సందర్భంగా ఆయన్ను చాలామంది కలవటం.. ఆయనతో ముచ్చట్లు పెట్టటం మామూలే అయినా.. ప్రజలకు తన సందేశాన్ని పంపేందుకు ఇప్పుడే సిద్ధం కావటం ఆసక్తికరంగా చెప్పాలి.
రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న అభిప్రాయంతో తాను ఉన్నప్పటికి.. ఆ విషయాన్ని టైమ్లీగా చెప్పాలన్నట్లుగా కాచుకొని కూర్చున్న కేసీఆర్.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితం వచ్చినంతనే స్పందించటం గమనార్హం. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు.
కేసీఆర్ పొలిటికల్ కెరీర్ ను చూస్తే.. ప్రత్యక్ష పోరాటంతో ఆయన అత్యున్నత పదవుల్ని చేపట్టటం కనిపించదు. అయితే బహిరంగ సభలు.. కాదంటే ఉప ఎన్నికల్ని ఆయుధాలుగా ఉపయోగించి పొలిటికల్ మైలేజీ పొందటం కనిపిస్తుంది. అంతేకాదు.. డైలీ బేసిస్ లో రాజకీయాల్ని చేయకుండా.. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయటం.. తన మీద ఆధారపడేలా చేసుకోవటం కనిపిస్తుంది. అప్పటివరకు వెయిట్ చేసే ఆయన.. ఆ తర్వాత ఎంతలా చెలరేగిపోతారో తెలుగు ప్రజలకు అనుభంలో ఉన్నదే.
రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌనాన్ని ఆశ్రయించటమే కాదు.. విపక్ష నేతగా ఉన్నప్పటికి.. అసెంబ్లీకి వెళ్లటం.. ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించటం.. సర్కారు చేసే తప్పుల్ని నిలదీయటం లాంటివి చేయలేదు. చివరకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అదే పనిగా అసెంబ్లీకి రావాలని ఆహ్వానించినప్పటికి లైట్ తీసుకున్న ఆయన.. తాజాగా మాత్రం నిప్పులు చెరగటం.. రేవంత్ సర్కారుపై ఘాటు విమర్శలు చేయటం కనిపిస్తుంది. కేసీఆర్ తాజా వ్యాఖ్యలు.. ఆయన కం బ్యాక్ అయినట్లేనా? అన్న చర్చ జరుగుతోంది. అయితే.. ఇలాంటి వ్యాఖ్యలన్ని కూడా టైమ్లీగానే ఉంటాయి తప్పించి.. ఆయన చెప్పినట్లుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పని చేయటం లాంటివి ఆశించటం అత్యాశే అవుతుంది.
గత ఏడాది రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన రోజున అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. అప్పుడు కూడా త్వరలోనే కార్యాచరణ ప్రకటించి.. ప్రజాపాలన అంతు చూస్తామని ప్రకటించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి తీరే కేసీఆర్ లో కనిపిస్తుందని చెప్పాలి. రేవంత్ సర్కారు మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చే వరకు వెయిట్ చేయటం.. అప్పుడప్పుడు ఇప్పటి తరహాలో నిప్పులు చెరగటం మాత్రం చేస్తుంటారని చెబుతున్నారు. ఏమైనా.. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సోషల్ సర్వే.. కేసీఆర్ కు టానిక్ మాదిరి పని చేసిందని చెప్పక తప్పదు.