వైసీపీ బిగ్ షాట్స్ కి బీజేపీ ఆహ్వానం ?
ఇక ఆ పార్టీలో ఉన్న నాయకులు తమకు ఎక్కడ ప్రాధాన్యత ఉంటుందో చూసుకుని జంప్ చేస్తున్నారు.;
ఏపీలో ఆపరేషన్ వైసీపీ అన్నది కొనసాగుతోంది. తెలుగుదేశం, జనసేన బీజేపీ ఇలా ఎవరికి వారు తమకు తోచిన తీరున ఫ్యాన్ పార్టీకి గేలం వేస్తున్నారు. ఇక ఆ పార్టీలో ఉన్న నాయకులు తమకు ఎక్కడ ప్రాధాన్యత ఉంటుందో చూసుకుని జంప్ చేస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎక్కువ మంది వైసీపీ నేతలు చేరారు. అలాగే జనసేన బీజేపీలలో కూడా కీలక నేతలు చేరారు.
విశాఖ రూరల్ జిల్లాలో సీఎం రమేష్ గెలుపుతో జెండా పాతిన బీజేపీ చూపు ఇపుడు ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం మీద పడింది అని అంటున్నారు. ఈ జిల్లాలో తొలిసారిగా బీజేపీ బోణీ కొట్టింది. ఎచ్చెర్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు. అలా శ్రీకాకుళం నగర ముఖద్వారం వద్ద కమల తోరణం కట్టిన బీజేపీ రానున్న రోజులలో మరింతగా బలపడాలని చూస్తోంది.
ఈ క్రమంలో వైసీపీ నుంచి కొందరు కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు చూస్తోంది అని అంటున్నారు. దశాబ్దాలుగా రాజకీయం పండించుకున్న ఇద్దరు దిగ్గజ నేతలు ప్రస్తుతం వైసీపీకి దూరం పాటిస్తున్నారు. ఆ ఇద్దరే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.
ఈ ఇద్దరికీ జగన్ ప్రభుత్వంలో మంచి పదవులే దక్కాయి. అయితే వైసీపీ ఓటమి పాలు కావడంతో తమ కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ సీనియర్ నేతలు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు విషయానికి వస్తే తన కుమారుడు ధర్మాన రాం మనోహర్ నాయుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఇచ్చే పార్టీ కోసం చూస్తున్నారు.
వైసీపీలో ఉంటే కష్టమని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు అందుకే ఆయన అంటీ ముట్టనట్లుగా పార్టీకి ఉంటున్నారు అని చెబుతున్నారు. మరో వైపు చూస్తే ధర్మాన టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ అక్కడ అవకాశం కుదరలేదు అని అంటున్నారు. జనసేనలో సైతం అదే విధంగా ఉందని చెబుతున్నారు.
అయితే బీజేపీ నుంచి ప్రసాదరావు కుటుంబానికి సాదర ఆహ్వానం వచ్చిందని అంటున్నారు. పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ దక్కిందని అంటున్నారు. అయితే ఆ పార్టీ ఆఫర్ ని అలా ఉంచుకుని బెస్ట్ ఆపషన్ కోసం వేచి చూసే ధోరణిలో ప్రసాదరావు ఫ్యామిలీ ఉందని చెబుతున్నారు.
ఇక తమ్మినేని సీతారాం ని ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి నుంచి వైసీపీ తప్పించింది. ద్వితీయ శ్రేణి నాయకుడికి ఆ చాన్స్ ఇచ్చింది. దాంతో రగిలిపోతున్న తమ్మినేని కుటుంబం జనసేనలోకి వెళ్ళాలని చూస్తోంది అని టాక్ నడచింది. ఎందుకంటే టీడీపీలో సొంత మేనల్లుడు కూన రవికుమార్ ఉన్నారు. ఆయనే ఆముదాలవలస సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
దాంతో జనసేన అయితే బెటర్ అనుకున్నా ఎందుకో కుదరడం లేదు అని అంటున్నారు. ఈ లోగా బీజేపీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని అంటున్నారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందిన తమ్మినేని సీతారాం ధర్మాన ప్రసాదరావులు వస్తే సిక్కోలులో కమలం వికసిస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ కాలం ఉండడంతో అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ఈ బడా నేతలు ఇద్దరూ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈలోగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ఉండొచ్చని అపుడు పెరిగిన సీట్లతో ప్రధాన పార్టీలలోనే చాన్స్ దక్కవచ్చన్న ఆశలు ఉన్నాయట. మొత్తానికి వైసీపీకి మాత్రం ఈ బిగ్ షాట్స్ దూరమేనా అంటే వారి మౌనమే డౌట్లు పెంచేస్తోంది అని అంటున్నారు.