'వేం'ను వరించిన ఎమ్మెల్సీ టికెట్.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం
తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల కిందటే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సారి అనేక మంది ఈ టికెట్ కోసం ప్రయత్నించారు. దీంతో చిట్ట చివరి వరకు అభ్యర్థిని ప్రకటించకుండా.. వేచి చూసేలా చేసిన పార్టీ అధిష్టానం.. శుక్రవారం రాత్రి పొద్దు పోయాక.. వేం నరేందర్‌రెడ్డిని ప్రకటించింది.
రేవంత్‌కు మిత్రుడు!
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి వేం నరేంద్ర రెడ్డి రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మిత్రుడే. గతంలో ఇద్దరూ టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత.. ఇద్దరూ కలిసి 2017, అక్టోబరులో టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే వేం నరేంద్ర రెడ్డికి ఈ సారి అవకాశం వచ్చిందన్న చర్చ జోరుగా సాగుతోంది. కాగా.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌పై కేసు నమోదైనట్టే.. అప్పట్లో వేం నరేందర్‌రెడ్డిపై నా కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెనసన్ ఓటు కోసం.. ముడుపులు ఇచ్చారనేది అభియోగం. దీనిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
2004లో మహబూబాబాద్ ఎమ్మెల్యే స్థానం నుంచి వేం విజయం దక్కించుకున్నారు. తర్వాత వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక, 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనే వివాదం అయ్యారు. ఆ తర్వాత.. టీడీపీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు.టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం వేం నరేందర్‌రెడ్డి అత్యంత విధేయుడన్న పేరుంది. ఇక, బీఆర్ ఎస్ కూడా ఈఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం కోసం అధికార, ప్రతిపక్షాల మధ్య భారీ పోరేసాగనుంది. కాగా, ఆర్థికంగానే కాకుండా.. సామాజికంగా కూడా వేం బలంగా ఉండడం.. ప్రభుత్వం అండగా ఉండడంతో ఆయన గెలుపు ఖాయమన్న వాదన వినిపిస్తోంది.