సోనియా స్ట్రాటజీతో బీజేపీ : జగన్ కి అలా చెక్ పెడుతుందా ?

ముఖ్యంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా పేరున్న రాయలసీమలో బీజేపీ బలపడాలని అది రెండిందాల లాభంగా ఉంటుందని ఊహిస్తోంది.

Update: 2025-02-01 06:30 GMT

గతంలో అంటే ఇప్పటికి పుష్కర కాలం క్రితం ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆయన మంత్రి కాకుండానే నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు. స్పీకర్ చెయిర్ నుంచి సభా నాయకుడిగా మారిపోయారు. ఆనాటి రాజకీయ పరిస్థితులను తీసుకుంటే కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని జగన్ వేరు పడ్డారు. ఒక విధంగా కాంగ్రెస్ లో అస్థిరత తాండవించింది.

వైఎస్సార్ మరణానంతరం చాలా మంది జగన్ వైపుగా మొగ్గు చూపడంతో అధినాయకత్వం అప్రమత్తమై అదే సామాజిక వర్గానికి చెందిన నల్లారిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రెడ్డి కార్డుని వాడింది. నల్లారి వచ్చాక ఒక బలమైన వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి కట్టుబడి పోయారు. ఆ విధంగా ప్రభుత్వం నిలబడింది కానీ పార్టీ పరంగా మాత్రం కాంగ్రెస్ దెబ్బ తింది. జగన్ ని నిలువరించడంలో నల్లారి వారు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలవంతం కాలేకపోయాయి.

కట్ చేస్తే మళ్ళీ అదే నల్లారి వారు జగన్ కి ప్రత్యర్ధిగా ఎదురు నిలవబోతున్నారా అన్నది చర్చగా ఉంది. ఆయన ఇపుడు బీజేపీలో ఉన్నారు. ఉమ్మడి ఏపీకి లాస్ట్ సీఎం గానే కాకుండా ఆయన సామాజిక ప్రాంతీయ నేపథ్యం బీజేపీని ఇపుడు ఆకర్షిస్తోంది. ఆయన సేవలను ఏపీలో దండీగా వాడుకోవాలని చూస్తోంది.

ముఖ్యంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా పేరున్న రాయలసీమలో బీజేపీ బలపడాలని అది రెండిందాల లాభంగా ఉంటుందని ఊహిస్తోంది. ఇక విభజన ఏపీలో చూస్తే ఇప్పటిదాక కమ్మ, కాపులకు మాత్రమే బీజేపీ అధ్యక్ష పదవిని ఇచ్చింది. ఈసారి బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం ద్వారా వారిని తమ వైపు తిప్పుకుంటే ఏపీ రాజకీయాల్లో దూసుకుని పోవడానికి మార్గం సుగమం అవుతుందని బీజేపీ భావిస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి వైపు చూస్తోంది. ఆయనను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ చేయాలని అనుకుంటోంది. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే వైసీపీలో జగన్ వెనకాల ఉన్న బలమైన రెడ్డి వర్గం నేతలు కూడా బీజేపీ వైపుగా వస్తారని అంచనా కడుతోంది.

అలా కిరణ్ వర్సెస్ జగన్ అన్న రాజకీయ సమరానికి తెర తీయాలని అనుకుంటోంది. ఇక చూస్తే గతంలో ఇదే జరిగింది. సోనియా స్ట్రాటజీ నాడు కిరణ్ కి ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తే బీజేపీ అదే వ్యూహాన్ని ఫాలో కావాలని అనుకుంటోందని తద్వారా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కిరణ్ కి పగ్గాలు అందుతాయని అంటున్నారు. ఆనాడు జగన్ ని నిలువరించడంతో కొంత వరకే సక్సెస్ అయిన కిరణ్ ఈసారి పూర్తి స్థాయిలో విజయవంతం అవుతారా అన్నది చర్చగా ఉంది.

నాటికీ నేటికీ పరిస్థితులు మారాయి కాబట్టి జగన్ మీద నల్లారి వారు నల్లేరు మీద బండి మాదిరిగా దూసుకుని వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక చూస్తే బీజేపీ మాత్రం ఏపీలో తమ బలాన్ని పెంచుకోవడానికి సర్వ శక్తులూ ప్రయోగిస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో కిరణ్ కి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు కేంద్ర పెద్దల నుంచి దక్కుతాయని అంటున్నారు. ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయడంతో పాటు ఈ కీలక పదవిని అప్పగించి వైసీపీ మీదకు ప్రయోగిస్తారు అని వస్తున్న వార్తల వెనక వాస్తవాలు ఏమిటి అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News