2019 నుంచి నిర్మలమ్మ 'బడ్జెట్' శారీస్ ప్రత్యేకతలు ఇవే... ఈసారి మరీ స్పెషల్!
ఈ సమయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీర ప్రత్యేకతపై చర్చ తెరపైకి వచ్చింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో... శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే.. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగం మొదలుపెట్టారు. ఈ సమయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీర ప్రత్యేకతపై చర్చ తెరపైకి వచ్చింది.
అవును... తాజాగా 8వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్.. మొదటి నుంచీ ఆమె ఈ సమయంలో ధరించే చీరలపైనా చాలా మంది దృష్టి పెడుతుంటారు. ఆమె కేటాయింపులపై కొంతమంది దృష్టి పెడితే.. ఆమె కట్టే చీర, దాని వెనుకున్న కథపై మరికొంతమంది దృష్టి పెడుతుంటారని అంటారు. ఇది 2019 నుంచి కొనసాగుతుండటం గమనార్హం.
2019లో తొలిసారిగా ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. అప్పటి నుంచి ఏటా బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ఏదొక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. అప్పటి వరకూ బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్ కేసు స్థానంలో బహీ ఖాతాతో కనిపించారు.
2020లో పసుపుపచ్చ - బంగారు వర్ణంలో నీలి రంగు అంచు కలిగిన చీరలో మెరిశారు నిర్మలమ్మ. నాడు "ఆస్పిరేషనల్ ఇండియా" థీమ్ కు అనుగుణంగా దీని ధరించారు. 2021లో ఎరుపు - గోధుమ రంగు కలగలిపిన బూధాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లిని.. "సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా"గా పిలుస్తారు.
2022లో మెరూన్ రంగు ఒడిశాకు చెందిన చీరను ధరించిన నిర్మలమ్మ.. చాలా సింపుల్ గా కనిపించారు! అనంతరం.. 2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్ లో బ్రైట్ రెడ్ కలర్ చీరతో కనిపించారు.
ఇక గత ఏడాది (2024) సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో.. కాంతా చీరలో కనిపించారు నిర్మలమ్మ. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ప్రతీకగా రామా బ్లూ రంగు చీర ధరించారు. అదే ఏడాది ఎన్నికల అనంతరం జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలో తెలుపు రంగు, బంగారు మెటిఫ్ లతో ఉన్న చీరలో కనిపించారు.
ఇక మూడో సారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో ఎనిమిదోసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్... ఈసారి కూడా హ్యాండ్లూమ్ చీరనే ఎంచుకున్నారు. బంగారు అంచుతో ఉన్న గోధుమ రంగు చీర, ఎరుపు రంగు జాకెట్, అదే గోదుమరంగు శాలువాతో కనిపించారు. దీనిపై ఉన్న చేపల ఆర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది!
ఈ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ చీరను నిర్మలమ్మకు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి కానుకగా ఇచ్చారు. కళాకారిని అయిన దులారీ తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను నిర్మలమ్మకు బీహార్ లోని మధుబనికి ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్లినప్పుడు బహుకరించారు. బడ్జెట్ వేళ దీన్ని ధరించాలని ఆమె కోరినట్లు చెబుతున్నారు.