ఆయన.. 'అయ్యన్న'.. ఏపీ స్పీకర్ అయితే కథ మామూలుగా ఉండదు

అటు ఉమ్మడి ఏపీలో, ఇటు విభజిత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి దక్కింది.

Update: 2024-06-18 23:30 GMT

25 ఏళ్లు దాటీదాటంగానే మంత్రి పదవి.. అది కూడా ఉమ్మడి ఏపీ వంటి అతిపెద్ద రాష్ట్రంలో.. ఎన్టీఆర్ వంటి గొప్ప నాయకుడి మంత్రివర్గంలో.. ప్రతి రాజకీయ నాయకుడూ కలగనే డెబ్యూ ఇది. దీనిని సొంతం చేసుకున్నారు ఏపీకి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. నలభై ఏళ్ల కిందటనే ఉమ్మడి ఏపీలో అతి చిన్నవయసు మంత్రి అయిన ఆయన.. ఇప్పుడు దాదాపు 70కి చేరువగా ఉన్న దశలో విభజిత ఏపీకి స్పీకర్ కాబోతున్నారు.

మంత్రి కాదు..

అటు ఉమ్మడి ఏపీలో, ఇటు విభజిత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి దక్కింది. కానీ, ఈసారి మాత్రం ఆయన శాసనసభాపతిగా రాజ్యాంగబద్ధ హోదాలో కొనసాగనున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన పోలినాటి వెలిమ సామాజిక వర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడు.. ఎన్టీఆర్ కు ఎంతటి అభిమాన పాత్రుడో, చంద్రబాబుకూ అంతే అభిమాన పాత్రుడు. అసలు టీడీపీకే ఆయన అభిమానపాత్రుడు.

ప్రతిపక్షంలో ఇబ్బందులు ఎదుర్కొని

2019-24 మధ్య విపక్షంలో ఉండగా టీడీపీ వాయిస్ ను బలంగా వినిపించారు అయ్యన్నపాత్రుడు. దీంతో ఆయన ఆస్తులపై గత ప్రభుత్వం కన్నేసింది. తెల్లవారుజామునే అధికారులను పంపింది. అయితే, దీనికీ అయ్యన్నపాత్రుడు గట్టిగానే సమాధానం ఇచ్చారు. మీడియా సమావేశాల్లో, పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లో వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజాలను తీవ్ర పదజాలంతో విమర్శించేవారు.

స్పీకర్ గా ఇప్పుడు ఎలానో?

అత్యంత బలమైన ప్రభుత్వం ఉండగా, అయ్యన్న ఇప్పుడు స్పీకర్ హోదాలో సభను నడిపించాల్సి ఉంది. అందులోనూ విపక్ష వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తమపై ఒంటికాలితో లేచే అయ్యన్న స్పీకర్ గా ఉండడం వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు మహా ఇబ్బందికరమే. అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా? లేదా? అనే అనుమానాల నడుమ.. స్పీకర్ కుర్చీలో అయ్యన్నపాత్రుడు ఉండడం ఆసక్తికరం కానుంది.

Tags:    

Similar News