ఈ స్పీడు సరిపోదు గేరు మార్చాల్సిందే.. : సీఎం చంద్రబాబు

ఈ స్థితిలో మరింత వేగంగా అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా అంతా తనతో కలిసి పని చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Update: 2025-01-01 16:46 GMT

నూతన సంవత్సరం పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళిక పై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. గత ఐదేళ్లూ చీకట్లు అలుముకున్న రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని, ఈ స్థితిలో మరింత వేగంగా అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా అంతా తనతో కలిసి పని చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

నూతన సంవత్సరం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి గడిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు గత ఏడాది జరిగిన ఎన్నికలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. రాష్ట్ర చరిత్రను తిరగరాసే విధంగా ప్రజల తీర్పునిచ్చారని, వారు ఇచ్చిన తీర్పు ప్రకారం తాను నడుచుకుంటానని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు మేరకు వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అంతా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు

కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలు కొత్త విధానాలకు నాంది పలకాలని చెప్పిన చంద్రబాబు గత ఐదేళ్లలో పూర్తిగా పాలనలో విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. ఆ ఐదేళ్లు పూర్తిగా చీకట్లోనే ఉన్నాం, అసలు ఏం చేయాలో కూడా అర్థం కానంత విధ్వంసం సృష్టించి పోయారు. అధికారులకు అంతా తెలుసు, ఏ శాఖ రివ్యూ చేసిన అంతా నాశనమే నిర్వీర్యమే అలాంటి పరిస్థితుల్లో పాలను మొదలుపెట్టే ఆరు నెలల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాం, ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టాం, ఈ ఆరు నెలల పాలనలో పెన్షన్లను పెంచాం, అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం, దీపం పథకం కింద ఉచిత సిలిండర్లను అందజేశాం, 15కు పైగా కొత్త పాలసీలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ను పునరుద్ధరించాం, పెట్టుబడులను తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.

జూన్ 12న ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన నుంచి ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగాయి. తమ ప్రభుత్వం కొత్త పాలసీలతో రాష్ట్ర బ్రాండ్ ను పునరుద్ధరించడం వల్ల ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ రూ.1.40 లక్షల కోట్లు, ఎన్టీపీసీ రూ. 1.85 లక్షల కోట్లు, రిలయన్స్ టాటాతో కలిపి గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులుగా రూ.83 వేల కోట్లు, బిపిసిఎల్ రూ.96,862 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయని చెప్పారు. అదే విధంగా ఐటీ రంగంలో ప్రతిష్టాత్మక టిసిఎస్, గూగుల్ వంటి కంపెనీలు మన రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

అయితే ఈ స్పీడు సరిపోదని, గేరు మార్చాలని, ఇంకా చాలామంది అధికారులు గత ప్రభుత్వం లో ఉన్నట్లే నిద్రపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు, అధికారులు గత ప్రభుత్వ జాడ్యాన్ని వదిలించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం తనతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ఉండే సచివాలయ ఉద్యోగి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు అంతా కలిసి పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పిన చంద్రబాబు, ఈ ఆరు నెలల్లో జీరో నుంచి మొదలుపెట్టి అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మెరుగైన ఫలితాలు సాధించాలంటే అధికారుల రొటీన్ గా వర్క్ చేయకూడదని వినూత్న ఆలోచనలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. మనసుంటే మార్గం ఉంటుంది, అన్నిటికీ డబ్బే అవసరం లేదు, కొత్త ఆలోచనలు ఆవిష్కరణలతో అనేక పనులు అవుతాయి, ఆర్థికేతర అంశాలతో ప్రజల అవసరాలను వెంటనే తీర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు

తనకు రాష్ట్ర సమగ్రాభివృద్ధి ముఖ్యమన్న చంద్రబాబు విపక్ష వైసిపి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకా విషం చిమ్మాలని, ఆ పార్టీ నేతలు బుద్ధి లేకుండా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువగా ఉత్తరాంధ్ర రాయలసీమలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. విజన్ 2047 ప్రవేశపెట్టిన తమ ప్రభుత్వం 2029 లోగా ఏం చేయాలో అది చేస్తామని, మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తామని ప్రకటించారు. ‘‘నేను అధికార యంత్రాంగాన్ని పక్కన పెట్టను. వారిని గౌరవిస్తాను. కానీ మీరు పని చేయాలి. విజన్ సాకారంలో మీ సహకారం, భాగస్వామ్యం ఎంతో అవసరం. టెక్నాలజీని వాడుకుని చిత్తశుద్ధితో సంకల్పంతో పనిచేస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా అందరం కలిసి పనిచేద్దాం’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News