అవును.. ఈ బస్సుకు డ్రైవర్ లేడు.. ఎక్కడంటే?
ఈ డ్రైవర్ లెస్ బస్సులో జర్నీ చేసేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.;
అవును.. ఒక బస్సు యూరోప్ లో సందడి చేస్తోంది. యూరోపియన్లు ఆ బస్సు గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. బస్సు గురించి యూరోపియన్లు అంతలా మాట్లాడుకోవటమా? అన్న సందేహం అక్కర్లేదు. దీనికి కారణం..సదరు బస్సుకు డ్రైవర్ లేకపోవటమే. ఈ డ్రైవర్ లెస్ బస్సులో జర్నీ చేసేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. డ్రైవర్ లేకున్నా.. బస్సులో ఎక్కి జర్నీ చేసేందుకు ధైర్యం చేస్తున్న వారికి నజరానాగా.. ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది స్పెయిన్ ప్రభుత్వం.
స్పెయిన్ రాజధాని బార్సిలోనా నగర వీధుల్లో సందడి చేస్తున్న ఈ బస్సు అతి తక్కువ దూరంలోనే నడుపుతున్నారు. అందులో బస్సు ఎక్కే ప్రయాణికులకు వారం పాటు ఎలాంటి ఛార్జ్ వసూలు చేయట్లేదు. డ్రైవర్ లెస్ విద్యుత్ వాహనం బార్సిలోనా సిటీకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మొదట్లో ఆసక్తిగా చూశారే కానీ ప్రయాణించేందుకు ఇష్టపడని పలువురు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఈ బస్సులో జర్నీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
గంటకు 40కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే ఈ బస్సును ఒకసారి ఛార్జ్ చేస్తే 120కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుంది. ఈ బస్సు చుట్టూ 10 అత్యాధునిక కెమెరాలు.. సెన్సార్ లతో పని చేసేలా ఏర్పాటు చేశారు. ఈ బస్సును కేవలం 2.2 కిలోమీటర్ల రౌండ్ పరిధిలోనే నడుపుతున్నారు. ఈ దూరానికి నాలుగు స్టాపులు ఏర్పాటు చేశారు. డ్రైవర్ లెస్ వాహనాల తయారీలో పేరున్న వీరైడ్ సంస్థతో ఫ్రెంచ్ దిగ్గజ కార్ల సంస్థ రెనాల్ట్ తో చేతులు కలిపి ఈ అత్యాధునిక బస్సును తయారు చేశారు. అయితే.. ఈ తరహా బస్సు ఇప్పటివరకు లేదా అంటే.. జపాన్.. అమెరికా దేశాల్లో ఉన్నప్పటికి యూరోప్ కు మాత్రం ఇదే తొలి బస్సు.
సాధారణ ఇంజిన్ తో నడిచే బస్సుల్లో ప్రయాణించి బోర్ కొట్టిందని.. అందుకే ఈ డ్రైవర్ లెస్ బస్సును ఎక్కినట్లుగా యూత్ చెబుతున్నారు. ఈ బస్సు పని తీరు బాగుందన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది. సిగ్నళ్ల వద్ద పక్కాగా ఆగటంతో పాటు.. ఎవరైనా పాదచారులు రోడ్డుదాటే వేళలో ట్రాఫిక్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోలేదని చెబుతున్నారు. ఈ బస్సులో ఎక్కినోళ్లు మాత్రమే కాదు.. ఎక్కని వారు మాత్రం చేస్తున్న ఒక పనేమంటే.. బస్సుతో సెల్ఫీ దిగటం. ఈ డిజిటల్ ప్రపంచంలో ఏమున్నా.. లేకున్నా ఫోటోలు ముఖ్యం కదా.