అర్థరాత్రి వేళ బీజేపీ జిల్లా అధ్యక్షుడు.. పోలీసు అధికారి ఫైట్.. ఎక్కడంటే?
బీజేపీ జిల్లా అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన ఎస్ఐపై అంతే వేగంగా సదరు నేత చేయి చేసుకోవటం.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.;
అర్థరాత్రి వేళ హోటల్ వద్ద కొందరు వ్యక్తులు ఉన్న నేపథ్యంలో.. అటుగా వెళుతున్న పోలీసులు తమ వాహనాన్ని ఆపటం.. అక్కడున్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించటం.. ఈ క్రమంలో చోటు చేసుకున్న అనూహ్య ఘటన షాకింగ్ గా మారింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన ఎస్ఐపై అంతే వేగంగా సదరు నేత చేయి చేసుకోవటం.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..
బెంగళూరుకు 270కిలోమీటర్ల దూరంలో చిత్రదుర్గకు సమీపంలోని దుర్గాడ సిరి హోటల్ వద్ద అర్థరాత్రి వేళ కొందరు నిలిచి ఉన్న విషయాన్ని అటుగా వెళుతున్న పోలీసులు గుర్తించారు. తమ వాహనాన్ని ఆపి.. వెంటనే అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు సబ్ ఇన్ స్పెక్టర్ గాడిలింగ గడౌర్. ఆ సమయంలో మధుగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు హనుమంత గౌడు అక్కడే ఉన్నారు.
పోలీసు అధికారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలం వాడుతూ మీదమీదకు రావటంతో ఆయన చెంపపై ఎస్ఐ కొట్టారు. దీనికి ప్రతిగా హనుమంత గౌడ తిరిగి కొట్టటంతో వారి మధ్య గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. హోటల్లో భోజనం చేసి తిరిగి వెళ్లే వేళలో పోలీసు అధికారి వచ్చి పరుష పదజాలంతో హనుమంత గౌడను తిట్టినట్లుగా ఆయన కారు డ్రైవర్ తెలిపారు. దీంతో ఆయన కూడా ఘాటుగా మాట్లాడారని.. ఇద్దరి మధ్య చెంపదెబ్బల ఫైటింగ్ జరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపైచిత్రదుర్గ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.