ఉత్తరాంధ్రాను చుట్టేయనున్న చంద్రబాబు

ముఖ్యమంత్రిగా ఆయన విశాఖ ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్లారు.

Update: 2024-11-01 01:30 GMT

ముఖ్యమంత్రి అయిన తరువాత దాదాపు అయిదు నెలలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఉత్తరాంధ్రా పర్యటనను పెట్టుకున్నారు. ఆయన నవంబర్ 1,నవంబర్ 2 తేదీలలో ఉత్తరాంధ్రా పర్యటన చేపట్టారు. ముఖ్యమంత్రిగా ఆయన విశాఖ ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్లారు. కానీ ఆయన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు అసలు వెళ్లలేదు

కానీ ఈసారి మాత్రం ఆయన మూడు ఉమ్మడి జిల్లాలలో తన పర్యటనను పెట్టుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారు అయింది. చంద్రబాబు ఉచిత గ్యాస్ పధకాన్ని నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభిస్తారు.

ఈ ఆ పధకం ద్వారా ఏపీలోని పేద మహిళలకు న్యాయం జరుగుతుందని బాబు గట్టిగా చెప్పనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో భారీ హామీని అమలు చేయడానికి బాబు ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన జిల్లాను ఎంచుకున్నారు. అక్కడ నుంచి బాబు ఏపీలోని మహిళలకు సందేశం ఇవ్వనున్నారు

ఈ కార్యక్రమం తరువాగ్త బాబు విజయనగరం జిల్లా పర్యటన 2వ తేదీన షెడ్యూల్ చేయబడింది. నవంబరు 2న చంద్రబాబు విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం పురిటిపెంటకు వెళ్లనున్నారు. పురిటిపెంట పర్యటనలో చంద్రబాబు రోడ్డుపై గుంతలు పూడ్చే పనుల్లో పాల్గొంటారు.

రాష్ట్రవ్యాప్తంగా 826 కోట్ల రూపాయాల్తో కూటమి ప్రభుత్వం రహదారి మరమ్మతు పనులు చేపడుతున్న క్రమంలో దానిని చంద్రబాబు విజయనగరం జిల్లాలో ప్రారంభిస్తారు అన్న మాట. అంటే సంక్షేమానికి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధికి విజయనగరం జిల్లాను బాబు ఎంచుకున్నారని అంటున్నారు.

ఇక విజయనగరం పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వెళ్లనున్నారు. నవంబరు 2వ తేదీన చంద్రబాబు విశాఖ కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా విజన్-2047 డాక్యుమెంట్ తయారీకి సంబంధించి వివిధ భాగస్వాములతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

మొత్తం మీద చూసినపుడు మూడు జిల్లాలలోనూ బాబు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జనంలోకి బలంగా పంపడమే కాకుండా మరో పాతికేళ్లలో ఏపీ నంబర్ వన్ స్టేట్ గా చేసేందుకు విజన్ 2047 కార్యక్రమాన్ని రూపొందించారు. దాని మీద ఆయన సమీక్ష చేపట్టి విశాఖ నుంచి ఏపీకి మరో కీలక సందేశం పంపిస్తారు అని అంటున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రా జిల్లాలు టీడీపీ కూటమికి నూటికి తొంబై తొమ్మిది శాతం సీట్లు ఇచ్చి భారీ విజయాన్ని అందించాయి. దాంతో ఉత్తరాంధ్రా జిల్లాలలో పట్టుని కొనసాగించేందుకు టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే ఆయన ఉత్తరాంధ్రా జిల్లాలో రెండు రోజుల బిజీ పర్యటనను ప్రకటించారు.

Tags:    

Similar News