రూ.42 లక్షల కోట్ల ఏఐ ప్రాజెక్టు... ట్రంప్ నేతృత్వంలో అద్భుత ఆవిష్కరణ!
ఈ దశాబ్ధంలోని సాంకేతిక సంచలనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే సంగతి తెలిసిందే. ‘ఏఐ’ తో అన్నీ సాధ్యమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ దశాబ్ధంలోని సాంకేతిక సంచలనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే సంగతి తెలిసిందే. ‘ఏఐ’ తో అన్నీ సాధ్యమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏఐ డిక్షనరీలో అసాధ్యం అనే పదం లేదని చెబుతున్నారు. ఈ సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆసక్తికర ప్రాజెక్టును తాజాగా ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన విషయాలు సంచలనంగా ఉన్నాయి!
అవును... ఓపెన్ ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ సంయుక్త భాగస్వామ్యంతో "స్టార్ట్ గేట్" అనే వెంచర్ ప్రారభమైంది. ఈ భారీ ఏఐ ప్రాజెక్టును డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో... ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్, ఒరాకిల్ సీటీఓ ల్యారీ ఎల్లిసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్భుత అంశం తెరపైకి వచ్చింది.
భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. ఏఐని ఎంత బాగా వినియోగించుకుంటే ఆ దేశాలు అంతగా ముందుకు వెళ్తాయని చెబుతున్నారు. ఈ సమయంలో ప్రపంచానికి అతిపెద్ద అనారోగ్య సమస్యగా మారిన ప్రాణాంతక క్యాన్సర్ కు వ్యాక్సిన్ కనుక్కునే విషయంలో ఈ తాజా ప్రాజెక్ట్ సహకరిస్తుందని అంటున్నారు.
ఇందులో భాగంగా... ఈ ఏఐ ప్రాజెక్ట్ సాయంతో క్యాన్సర్ ను గుర్తించిన 48 గంటల్లోనే వ్యాక్సిన్ ను తయారు చేసి ఇవ్వొచ్చని టెక్ దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 500 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ట్రంప్ వెళ్లడించారు. అంటే... భారత కరెన్సీలో రూ.42 లక్షల కోట్లన్నమాట.
ట్రంప్ బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రధానంగా అమెరికాలో ఈ ప్రాజెక్ట్ వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. అయితే.. అందులో విదేశీయుల వాటా అతిస్వల్పం గా ఫిక్స్ చేస్తే.. "అమెరికా ఫస్ట్" అనే ట్రంప్ నినాదానికి జస్టిఫికేషన్ వచ్చినట్లే అని అంటున్నారు.
ఉద్యోగ అవకాశాలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్:
ఈ భారీ ప్రాజెక్టులో కీలక భూమిక పోషించబోతున్నట్లు చెబుతున్న ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఈ ప్రాజెక్ట్ అమెరికాలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించనుందని తెలిపారు. ఇదే సమయంలో... క్యాన్సర్ ను ఏఐ సాయంతో వేగవంతంగా గుర్తించడంతో పాటు నయం కూడా చేసే అవకాశం లభించనుందని వెల్లడించారు.
ప్రయోజనాలు వివరించిన ఒరాకిల్ సీటీఓ ల్యారీ ఎల్లిసన్!:
ఈ భారీ ఏఐ ప్రాజెక్టుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఒరాకిల్ సీటీఓ ల్యారీ ఎల్లిసన్ వివరించారు. ఈ సందర్భంగా... క్యాన్సర్ కు సంబంధించిన చిన్న ట్యూమర్స్ రక్తంలో తేలియాడుతూ ఉంటాయని.. వాటిని ఏఐ సాయంతో ముందుగానే గుర్తించొచ్చని.. ఇదే సమయంలో వెంటనే రక్త పరీక్ష చేయించుకుని వీలైనంత వేగంగా క్యాన్సర్ ను నిర్ధారించుకోవచ్చని అన్నారు.
ఇలా వీలైనంత ముందుగానే క్యాన్సర్ ను గుర్తించిన తర్వాత ఆ వ్యక్తికి వ్యాక్సిన్ అందించాలని తెలిపారు. ఈ సమయంలో.. వ్యాధి తీవ్రతను బట్టి ఒక్కో వ్యక్తికీ ప్రత్యేకమైన వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయాలని.. ఈ వ్యాక్సిన్ లను ఏఐ సాయంతో రోబోటిక్ టెక్నాలజీతో 48 గంటల్లోనే తయారు చేసే వీలు లభిస్తుందని వెల్లడించారు.
స్వర్ణయుగానికి ఆరంభం అంటున్న సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి!:
ఈ కీలక ప్రాజెక్ట్ లో ఓపెన్ ఏఐ, ఒరాకిల్ తో పాటు సంయుక్త భాగస్వామి అయిన సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి స్పందించారు. ఈ సందర్భంగా... అమెరికా స్వర్ణ యుగానికి ఈ ప్రాజెక్ట్ ఆరంభం అంటు సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో... ఈ ప్రాజెక్ట్ ను డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు.