రేవంత్ మీదకు బాబు పవన్... ఈ ప్లాన్ వెనక పెద్దాయన ?

అయితే ఆయన బాబు పట్ల అదే గురు భావంతో ఉంటే బాబు రేవంత్ రెడ్డిని శిష్య వాత్సల్యంతో చూస్తూ వస్తున్నారు.

Update: 2024-06-11 02:45 GMT

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు శిష్యుడు. గతంలో టీడీపీలో కీలకంగా ఉండేవారు. ఇపుడు ఆయన కాంగ్రెస్ లో చేరి సీఎం అయ్యారు. అయితే ఆయన బాబు పట్ల అదే గురు భావంతో ఉంటే బాబు రేవంత్ రెడ్డిని శిష్య వాత్సల్యంతో చూస్తూ వస్తున్నారు.

అయితే ఈ బంధానికి రాజకీయం అతి పెద్ద అడ్డు కాబోతోంది అని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ కి చెక్ చెప్పాలని బీజేపీ భావిస్తోంది. ఇంతింతీ వటుడింతే అన్నట్లుగా తెలంగాణాలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న బీజేపీ తాజా ఎన్నికలలో ఎనిమిది ఎంపీ సీట్లు సాధించింది.

దాంతో రానున్న ఎన్నికల్లో తెలంగాణా అసెంబ్లీలో జెండా పాతాలని బీజేపీ గట్టిగా టార్గెట్ పెట్టుకుంది. ఆ పని జరగాలంటే కాంగ్రెస్ మీదకు దూకుడుగా వెళ్లాలి. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మీదనే విమర్శల బాణాలు సంధించాలి. ఇక రానున్న రోజులలో దానికి తగిన రాజకీయ ప్రాతిపదికను బీజేపీ పెద్దలు సిద్ధం చేసి ఉంచారు.

తెలంగాణాలో తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. గ్రేటర్ హైదరాబాద్ ని బీజేపీ ఇపుడు లక్ష్యంగా చేసుకుంటోంది. గత ఎన్నికల్లో 44 మంది కార్పోరేటర్లను సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా మేయర్ పీఠాన్నే అందుకోవాలని భావిస్తోంది.

దానికి టీడీపీ జనసేనల మద్దతు కోరుకుంటోంది. టీడీపీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి పెద్ద మద్దతు ఉంది. తాజా ఎన్నికల్లో తెలంగాణా నుంచి ఏపీకి వచ్చి లక్షలాదిగా ఓట్లు వేసిన నేపధ్యం ఉంది. అలా రాజకీయంగా సామాజికపరంగా బలమైన పునాదులు కలిగిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ తెలంగాణాలో కూడా చూస్తుంది అని అంటున్నారు.

ఇక జనసేనతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే పోటీ చేసింది. ఈ రెండు పార్టీలను రానున్న రోజులలో కలుపుకుని ఏపీలో ఏర్పాటు చేసినట్లుగా కూటమిని కడితే గ్రేటర్ హైదరాబాద్ పీఠం తమదే అవుతుందని బీజేపీ లెక్క వేసుకుంటోంది.

అంతే కాదు 2028 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేస్తే అధికారం దక్కడం తధ్యమన్న భావన కూడా ఉందిట. దాంతో మోడీ ఇప్పటికే చంద్రబాబు పవన్ లకు టార్గెట్ రేవంత్ అని ఒక భారీ ప్లాన్ ఇచ్చేశారు అని అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రానున్న రోజులలో తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడానికి బాబు చూస్తున్నారు. అలాగే పవన్ కూడా తెలంగాణాలో పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారు. ఈ ఇద్దరు నాయకులు బీజేపీతో పొత్తులో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి మీద బీజేపీ నేతలతో పాటు చంద్రబాబు పవన్ కూడా భారీ ఎత్తున విరుచుకుపడాలన్నది బీజేపీ బిగ్ షాట్స్ ఇచ్చిన రోడ్ మ్యాప్. అదే కనుక జరిగితే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతారా లేక కూటమిని గట్టిగా కట్టడి చేస్తారా అన్నది రాజకీయ వెండి తెర మీద చూడాల్సిందే.

Tags:    

Similar News