బాలయ్య భారీ గిఫ్ట్ అందుకుంటారా ?
నందమూరి వారసుడు బాలయ్యకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందా అంటే అవకాశాలు చాలానే ఉన్నాయని చర్చ సాగుతోంది
నందమూరి వారసుడు బాలయ్యకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందా అంటే అవకాశాలు చాలానే ఉన్నాయని చర్చ సాగుతోంది. బాలయ్య హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 2014లో మొదలెట్టి 2024 లో తన మెజారిటీని అంతకంతకు పెంచుకుంటూ పోయారు. 2019లో జగన్ వేవ్ లో సైతం 17 వేల ఓట్ల తో గెలిచి తన సత్తా చాటారు.
హిందూపురాన్ని నందమూరిపురంగా మార్చడంతో బాలయ్య పూర్తిగా సక్సెస్ అయ్యారు. బాలయ్య పోటీ చేస్తే విజయం ఖాయం అన్న అభిప్రాయాన్ని తీసుకుని వచ్చారు. తనకు కంచుకోటగా మార్చుకున్నారు. ఈసారి కూడా 36 వేలకు తక్కువ కాకుండా భారీ మెజారిటీతో గెలిచిన బాలయ్యకు మంత్రి పదవి ఖాయం అని ఆయన అభిమానులు అంటున్నారు.
బాలయ్యను మంత్రిగా చూడాలని 2014 నుంచి కళ్ళు కాయలు కాచేలా ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అప్పట్లో తొలిసారి బాలయ్య గెలవగానే ఆయన మినిస్టర్ అని విపరీతంగా ప్రచారం చేశారు. కానీ ఆయనకు దక్కలేదు. ఇక 2019లో కచ్చితంగా మంత్రి అవుతారు అనుకుంటే టీడీపీ విపక్షంలోకి వెళ్ళిపోయింది.
ఇపుడు టీడీపీ పవర్ చేజిక్కుకోవడంతో బాలయ్యకు ఇచ్చి తీరాల్సిందే అన్నది అభిమానుల మాటగా ఉంది. ఈ విషయంలో చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారు అని అంటున్నారు. బాలయ్య పుట్టిన రోజు వేళ గ్రీట్ చేస్తూ తనకు అత్యంత అత్మీయుడు అని బావమరిది మీద తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఈసారి ఉమ్మడి అనంతపురం జిల్లా కోటా నుంచి తీవ్రమైన పోటీ ఉంది. పరిటాల సునీత పయ్యావుల కేశవ్ వంటి వారు రేసులో ఉన్నారు. అలాగే ధర్మవరం నుంచి గెలిచిన బీజేపీ నేత సత్యకుమార్ కూడా మంత్రి పదవి కోసం పరిశీలనలో ఉన్నారు. అయితే రాజకీయ సామాజిక లెక్కలు ఎలా ఉన్నా బాలయ్య విషయంలో మినహాయింపు ఇచ్చి మరీ మంత్రిని చేస్తారా అన్నదే చర్చగా ఉంది.
మరో వైపు చూస్తే బాలయ్యకు మంత్రి పదవి అని అది సినిమాటోగ్రఫీ శాఖ అని కూడా ప్రచారం సాగుతోంది. ఈ శాఖ కనుక ఇస్తే బాలయ్య తన అనుభవంతో సినీ పరిశ్రమకు అటు ఏపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బాలయ్య మినిస్టర్ అన్నది ఈసారి నెరవేరుతుందా అంటే ఫ్యాన్స్ మాత్రం అవును అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.