జగన్ మీద బాలినేని బాంబు.. అర్థరాత్రి లేపి సంతకం చేయాలన్నారు!
ఈ మొత్తం ఎపిసోడ్ ఇంధన రంగానికి చెందటంతో పాటు.. సౌర విద్యుత్ కొనుగోళ్లు.. ఒప్పందాల చుట్టూనే ఉంది.
పెను సంచలనంగా మారిన అదానీ ముడుపుల వ్యవహారం.. అమెరికాలో కేసులు నమోదు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ అటు తిరిగి.. ఇటు తిరిగి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్న వైనం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ ఇంధన రంగానికి చెందటంతో పాటు.. సౌర విద్యుత్ కొనుగోళ్లు.. ఒప్పందాల చుట్టూనే ఉంది.
తాజా పరిణామాల నేపథ్యంలో అప్పట్లో జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖా మంత్రిగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. పలు ఆసక్తికర అంశాల్ని బయటపెట్టారు. ఇవన్నీ ఇప్పుడు బాంబుల మాదిరి మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెకీతో ఒప్పందం వెనుక జరిగిన కథ తనకు తెలీదని.. అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్థరాత్రి ఒంటి గంట వేళలో తనను నిద్ర లేపి సంతకం చేయాలని చెప్పారన్నారు.
తనతో ఏ మాత్రం చర్చించకుండా.. నేరుగా ఫైల్ మీద సంతకం చేయాలని కోరటంతో ఏదో మతలు ఉందనిపించిందని.. అందుకే తాను ఆ అర్థరాత్రి వేళలో ఫైల్ మీద సంతకం చేయలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ తన నిర్ణయాలతో సంబంధం లేకుండానే అంతా జరిగిపోయిందన్న బాలినేని.. ‘‘అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు నాతో ఎందుకు మాట్లాడతారు? అప్పుడప్పుడు శ్రీకాంత్ వచ్చి సెకితో కుదిరిన ఒప్పందాల గురించి చర్చించేవారు. కానీ.. ఎప్పుడూ పూర్తి వివరాలు చెప్పలేదు. సంబంధిత మంత్రిని అయినప్పటికీ ఒక్క చోటా సంతకం చేయలేదు. తర్వాతి రోజు మంత్రివర్గ సమావేశం ఉందనగా.. అర్థరాత్రి ఒంటి గంట వేళలో శ్రీకాంత్ ఫోన్ చేసి సెకితో ఒప్పంద దస్త్రంపై సంతకం చేయాలని కోరినట్లు చెప్పారు. అయితే.. అందులో ఏదో మతలబు ఉందని భావించి సంతకం చేయలేద్నారు.
‘‘పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతామని నా పీఎస్ అంతకుముందే అప్రమత్తం చేశారు. దాంతో నేను సంతకం చేయటానికి నో చెప్పా. కాసేపటి తర్వాత శ్రీకాంత్ నా అడిషనల్ పీఎస్ కు ఫోన్ చేసి.. సంతకం పెట్టకుంటే.. ఫైల్ ను మంత్రిమండలి సమావేశానికి పంపాలని చెప్పారు. ఆయన చెప్పినట్లే మంత్రిమండలి ముందుకు తీసుకెళ్లా. కేబినెట్ అనుమతితో ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకుంది. నేను ఎక్కడా ఒక్క సంతకం చేయలేదు. అంతా పెద్ద మంత్రి నడిపించారంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.