సంచలన నిర్ణయం..కరెన్సీ రద్దు..జాతి పిత ఫొటో లేకుండానే నోట్లు

స్వయంగా బ్యాంకర్ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ కరెన్సీ విషయంలో అత్యంత సంచలన అడుగు వేశారు.

Update: 2024-12-06 10:11 GMT

స్వయంగా బ్యాంకర్ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ కరెన్సీ విషయంలో అత్యంత సంచలన అడుగు వేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మక ఆర్థిక నోబెల్ ను దక్కించుకున్న ఆయన.. నోట్ల విషయంలో పెద్ద నిర్ణయమే తీసుకున్నారు.

మొత్తమ్మీద బంగ్లాదేశ్ కొత్త పాలకులు (తాత్కాలిక ప్రభుత్వం) తమ విద్వేషాన్ని బయటపెట్టుకుంటున్నారు. గత ఆగస్టులో షేక్ హసీనా నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం బంగ్లాలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, యూనస్ భారత్ కు పచ్చి వ్యతిరేకి. ఆయన మాటలే కాదు చేతలూ అలానే ఉంటాయి. పైకి మాత్రం భారత్ ను గౌరవిస్తామని చెబుతారు. కాగా, తిరుగుబాటు అనంతరం పదవిని వదలేసిన షేక్ హసీనా నేరుగా భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా ఆమె భారత్ లోనే ఉంటున్నారు. ఇక్కడినుంచే తమ పార్టీ అవామీ లీగ్ సమావేశాల్లో వర్చువల్ గా పాల్గొంటున్నారు. ఈమె తండ్రి ముజిబ్ ఉర్ రెహ్మాన్. బంగ్లా స్వతంత్ర ఉద్యమానికి ఈయనే సారథ్యం వహించారు. దీంతో బంగ బంధు అనే బిరుదును పొందారు. సొంత దేశం ఏర్పడ్డాక జాతిపిత అయ్యారు.

హసీనా దిగిపోయిన నెలకే..

బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ కరెన్సీలో జాతిపిత ముజిబుర్ రెహ్మాన్ ఫొటోను తొలగించాలని నిర్ణయించింది. బంగ్లా కరెన్సీ పేరు టాకా. 10, 100, 200, 500 టాకాల నోట్ల స్థానంలో కొత్తవి ముద్రిస్తోంది. అయితే, ఇదేమీ ఇప్పుడు చేపట్టలేదు. ఆగస్టులో హసీనా దిగిపోగా.. ఆ వెంటనే సెప్టెంబరులో ఆమె తండ్రి ఫొటో ఉన్న కరెన్సీని తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధిని కోట్ చేస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి.

బెంగాలీ కల్చర్.. విద్యార్థుల ఉద్యమం

వచ్చే జూలై కల్లా బంగ్లాలో కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. మొత్తం కరెన్సీని మార్చేలా కనిపిస్తున్నారు. మరోవైపు కొత్త కరెన్సీలో బెంగాల్ కల్చర్, హసీనా దిగిపోవడానికి కారణమైన విద్యార్థుల ఉద్యమం గ్రాఫిటీకి చోటిస్తారని తెలుస్తోంది.

కొసమెరుపు: బ్రిటిష్ పాలనలో 1947కు ముందు ఉమ్మడి భారత దేశంలో బంగ్లాదేశ్ ఓ భాగం. పాకిస్థాన్ ఏర్పాటు అనంతరం ఆ దేశంలో (తూర్పు పాకిస్థాన్) భాగమైంది. 1971లో స్వాతంత్ర్యం పొందింది. అంటే..75 ఏళ్లలో మూడు కరెన్సీలు (బ్రిటిష్, పాకిస్థాన్, బంగ్లా) చూసింది. ఇప్పుడు భారత కరెన్సీపై జాతి పిత మహాత్మా గాంధీ బొమ్మ, పాకిస్థాన్ నోట్లపై వారి జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా ఫొటోలు ఉండగా.. బంగ్లాలో మాత్రం ముజిబుర్ రెహ్మాన్ ఫొటోకు అవకాశం లేకుండాపోయింది.

Tags:    

Similar News