బారామతిలో ఆ ఇద్దరు లేడీస్ మధ్య 'మహా' పవర్ పోరు!
ఎన్సీపీని చీల్చి బీజేపీ సర్కారులో చేరి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన అజిత్ పవార్ కు.. దిగ్గజ నేతగా సుపరిచితులైన శరద్ పవార్ మధ్య అంతిమ పోరు తలపించే ఎన్నికల యుధ్దం చోటు చేసుకోనుంది.
సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో షురూ కానున్న వేళ.. మహా రాజకీయం మరింత రసకందాయంలో పడింది. రానున్న రోజుల్లో వదినా మరదళ్ల మధ్య జరిగే ఎన్నికల పోరు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. యావత్ దేశం బారామతి నియోజకవర్గం వైపు పడేలా చేయనుంది. ఎన్సీపీని చీల్చి బీజేపీ సర్కారులో చేరి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన అజిత్ పవార్ కు.. దిగ్గజ నేతగా సుపరిచితులైన శరద్ పవార్ మధ్య అంతిమ పోరు తలపించే ఎన్నికల యుధ్దం చోటు చేసుకోనుంది. అయితే.. ఈ పోరులో ఈ ఇద్దరు నేతలు ముఖాముఖిన తలపడటం లేదు. తమ తరఫున తమ కుటుంబ సభ్యుల్ని బరిలోకి దించటం ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు ట్విస్టుగా చెప్పాలి.
ప్రముఖ నేతగా పేరున్న శరద్ పవార్ కుమార్తె కం సిట్టింగ్ ఎంపీగా ఉన్న సుప్రియా సూలేకు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ కు మధ్య ఎన్నికల పోరు జరిగేలా కనిపిస్తోంది. ఈ వాదనకు బలాన్ని చేకూరే పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. బారామతి ఎంపీ సునేత్రా పవార్ అంటూ తాజాగా వెలిసిన భారీ కటౌట్లు తాజా రాజకీయ చర్చకు కారణంగా చెప్పాలి.
తాజా పరిణామాల నేపథ్యంలో బారామతి నియోజకవర్గంలో సునేత్ర పవార్ ను ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లుగా అధికారిక ప్రకటన మాత్రమే మిగిలినట్లైంది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న అజిత్ పవార్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈసారి బారామతిలో కొత్త అభ్యర్థిని నిలుపుతాం. తొలిసారి పోటీ చేస్తున్న అభ్యర్థి మన భవిష్యత్ తరాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పని చేయగలరు. కొందరు పాత భావోద్వేగాలతో ఓటు వేయమని మిమ్మల్ని అడుగుతారు. పట్టించుకోకండి. జరగబోయే నిరంతర అభివ్రద్ధిని మాత్రమే మనసులో ఉంచుకోండి. మొదటిసారి పోటీ చేస్తున్నా.. ఆశీర్వదించండి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే భారీ హోర్డింగ్ ఏర్పాటుకు కారణంగా చెబుతున్నారు.
అజిత్ పవార్ మాటల్ని తమకు అర్థమైన రీతిలో అన్వయించుకున్న ఎన్సీపీ క్యాడర్.. ప్రధాన కూడళ్ల వద్ద భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేవారు. శరద్ పవార్ కు కంచుకోటలాంటి బారమతిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2009 నుంచి సుప్రియా సూలే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. ఆమె తిరుగులేని అభ్యర్థిగా మారారు. బరిలోకి దిగితే విజయమే తప్పించి అపజయం అన్నది లేనట్లుగా ఆమె పొలిటికల్ గ్రాఫ్ ఉంది.
అయితే.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ పార్టీ చీలినట్లే ఓటర్లు కూడా చీలుతారని.. అదే జరిగితే పోటీ మహా టెన్షన్ గా మారుతుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వదినా మరదళ్లలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇక్కడో ఆసక్తికర అంశాల్ని వెల్లడించాలి. సుప్రియా సూలే గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ.. అజిత్ భార్యగా తప్పించి రాజకీయ వర్గాల్లో ఎవరికి పెద్దగా పరిచయం లేని పేరు సునేత్ర. చాలా ఏళ్లుగా సోషల్ వర్కు చేస్తున్నా రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటారు.
మరింత ఆసక్తికకరమైన అంశం ఏమంటే.. శరద్ పవార్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహిత నేతగా చెప్పుకునే మాజీ మంత్రి పద్మసిన్హా పాటిల్ చెల్లిలే సునేత్ర. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ.. ఆమె ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు.. సంఘ సేవలో పాల్గొంటూ బిజీగా ఉంటారు. ఇక.. అజిత్, సునేతలకు ఇద్దరు కుమారులు. వారిలో పార్థపవార్ 2019లో జరిగిన ఎన్నికల్లో మావాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
బారామంతి విషయానికి వస్తే.. పుణే జిల్లాలోని పవార్ కుటుంబానికి బారామంతి కంచుకోటగా అభివర్ణిస్తారు. గడిచిన 55 ఏళ్లుగా వీరిదే హవా. 1967లో శరద్ పవార్ బారామంతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక.. బారామతి ఎంపీ స్థానం నుంచి శరద్ పవార్ 1984, 1996, 1999, 2004లో విజయం సాధించగా.. 2009 నుంచి ఆయన కుమార్తె బరిలో ఉన్నారు. అయితే.. అసెంబ్లీ స్థానం నుంచి శరద్ పవార్ పోటీ నుంచి తప్పుకున్నాక అక్కడ అజిత్ పవార్ పోటీ చేస్తూ గెలుస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి అజిత్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయంసాధించారు.1991లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా ఈ నియోజకవర్గంలో పట్టు ఉన్న రెండు 'పవార్' కుటుంబాల మధ్య ఎన్నికల పోరు అసలుసిసలైన ఎన్నికల పవర్ ఫైట్ గా చెప్పక తప్పదు.