లోకేష్ సైలెంట్ వెనక...!?
అంతే ఏమి జరిగిందో ఏమో ఆయన మీడియా ముందుకు రావడం మానుకున్నారు.
టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆయన ఇప్పటిదాకా జనంలోనే ఉన్నారు. సరిగ్గా నెల రొజుల నుంచి నారా లోకేష్ వాయిస్ అయితే గట్టిగా వినిపించడంలేదు. దానికి కారణం అయితే అర్ధం కావడంలేదు అంటున్నారు. విశాఖలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది. ఆ తర్వాత భోగాపురంలో భారీ సభ నిర్వహించారు. ఆ వెంటనే లోకేష్ అనేక టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
అంతే ఏమి జరిగిందో ఏమో ఆయన మీడియా ముందుకు రావడం మానుకున్నారు. నిజానికి చూస్తే లోకేష్ మీడియా ఇంటర్వ్యూలలో టీడీపీ జనసేన పొత్తుల గురించి అధికారం వాటా గురించి తనకు తోచిన తీరున మాట్లాడారు. చంద్రబాబు అయిదేళ్ల సీఎం అయ్యారు. పవర్ షేరింగ్ ఉండదని కుండబద్ధలు కొట్టారు. అంతే కాదు ఉప ముఖ్యమంత్రి మిత్ర పక్షం అయిన జనసేనకు ఇస్తున్నారా అంటే దానికి కూడా ఆయన బదులిస్తూ ఆది టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు.
ఇలా వివాదాస్పదమైన కామెంట్స్ అయ్యాయి లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలలోని కొన్ని అంశాలు. ఆ తరువాత జనసేనలోని అగ్గి రాజుకుంది. కాపు పెద్దలు కూడా దీని మీద పవన్ కి వత్తిడి పెంచారు. సీఎం విషయం షేరింగ్ ఉండాలని అన్నారు. దాంతో ఆ ప్రభావం ఏమైనా పడిందా లేక మామూలుగానే ఇదొక వ్యూహమా అన్నది తెలియదు కానీ లోకేష్ మాత్రం సైలెంట్ అయిపోయారు.
ఆయన బయటకు రావడంలేదు. అయితే దీని మీద జరుగుతున్న ప్రచారం చూస్తే ఒక వ్యూహం ప్రకారమే చంద్రబాబు లోకేష్ ని అలా ఉండమని చెప్పారని అంటున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో లోకేష్ చుట్టూ చాలా మంది నేతలు ఉన్నారని, వారంతా టికెట్ విషయంలో వత్తిడి పెడుతున్నారని దాంతో లోకేష్ కూడా సిఫార్సు చేసేలా పరిస్థితులు వస్తున్నాయని అందుకే ఈ తలనొప్పులు ఎందుకు అన్నట్లుగా లోకేష్ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు.
ఆయన అభ్యర్ధుల ఎంపిక ఘట్టం పూర్తి అయ్యాక ఎన్నికల ప్రచారానికి జనంలోకి వస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే పాదయాత్ర తరువాత పార్టీలో వ్యవహారాలను లోకేష్ చూసుకుంటున్నారని ముందు ఇంటర్నల్ గా ఉన్న సమస్యలను ఆయన చూసుకుంటూ ఉంటే చంద్రబాబు ఎన్నికల సభలలోకి వెళ్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా లోకేష్ మరి కొన్ని రోజులు అలాగే సైలెంట్ గా ఉంటారని అంటున్నారు.