విడిచిపెడితే ముగిసినట్లే.. ముగిసేవరకూ విడిచిపెట్టం!
హమాస్ అధినేత యహ్యా సిన్వర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని హమాస్ సైతం ధృవీకరించింది.
హమాస్ అధినేత యహ్యా సిన్వర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని హమాస్ సైతం ధృవీకరించింది. ఈ సందర్భంగా యుద్ధం ముగించడం, ఇజ్రాయెల్ బందీలను విడిపించడం విషయంలో ఇరుపక్షాల నుంచి ఆసక్తికర స్టేట్ మెంట్లు వచ్చాయి. దీంతో... ఎవరి పంతం నెగ్గుతుంది..? ఎవరి ముగింపు ముందుంది..? అనేది ఆసక్తిగా మారింది.
అవును... గత ఏడాది అక్టోబరు 7నాటి దాడుల సూత్రధారి, హమాస్ అధినేత యహ్యా సిన్వర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించడం, దీన్ని హమస్ ధృవీకరించడం జరిగిపోయాయి. దీంతో.. ఇది ఆ మిలిటెంట్ గ్రూపుకు తగిలిన అతిపెద్ద దెబ్బ అని అంటున్నారు. ఈ సమయంలో యుద్ధం ముగింపు విషయాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... తమ బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తామని అన్నారు. గాజా పౌరులను, హమాస్ ను ఉద్దేశించి నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తమ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తామని అన్నారు. అలాకానిపక్షంలో.. యుద్ధం ఆగదని, వారిని వేటాడి మరీ హతమారుస్తామని హెచ్చరించారు.
ఇదే సమయంలో... వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను హతమారిన హంతకుడు మరణించాడని.. దీన్ని అతిపెద్ద విజయంగా తాను భావిస్తున్నానని.. అయితే ఇది గాజాతో యుద్ధం ముగింపు కాదు కానీ.. ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైంది అని తెలిపరు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ దళాలను ఆయన ప్రశంసించారు.
ఇలా యుద్ధం ఆపే విషయంలో గాజా ప్రజలకు, హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహు ఆఫర్ ఇచ్చినట్లు ప్రకటించిన అనంతరం.. హమాస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ యుద్ధం ముగించే వరకూ బందీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ తేల్చి చెప్పింది.
తమ ప్రాంతంపై బాంబు దాడులు ఆపి, ఇజ్రాయెల్ దళాలు ఉపసంహరించుకొని, యుద్ధం ముగించే వరకూ తమవద్ద ఉన్న బందీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హమాస్ తేల్చి చెప్పింది. దీంతో... ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయంపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు!
మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు అవిరామంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62 మంది మరణించగా.. 300 మంది గాయపడ్డారు. దీంతో.. మొత్తంగా ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినవారి సంఖ్య 42,500 కు చేరుకోగా.. గాయపడిన వారి సంఖ్య లక్ష దాటిందని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది.