బిగ్ డెబేట్ : ఏపీలో హంగ్ వస్తుందా !?
ఏపీ రాజకీయ చరిత్ర తీసుకుంటే ఎపుడూ హంగ్ తీర్పు ఇచ్చిన సందర్భం అయితే లేదు అనే అంటున్నారు.
ఏపీలో వచ్చేది హంగ్ ప్రభుత్వమా. ఇది ఇపుడు సోషల్ మీడియాతో పాటుగా ఎక్కడ చూసినా అతి పెద్ద చర్చగా ముందుకు వస్తోంది. ఏపీ రాజకీయ చరిత్ర తీసుకుంటే ఎపుడూ హంగ్ తీర్పు ఇచ్చిన సందర్భం అయితే లేదు అనే అంటున్నారు. ఇక విభజన ఏపీలో చూసుకున్నా 2014, 2019లలో జరిగిన రెండు ఎన్నికల్లో టీడీపీ వైసీపీకి ఏకపక్షంగా జనాలు తీర్పు ఇచ్చారు.
టీడీపీ కూటమికి 2014లో 106 సీట్లు ఇస్తే 2019లో వైసీపీకి సింగిల్ గానే 151 సీట్లు కట్టబెట్టారు. మరి 2024 ఎన్నికల్లో జనాలు ఏ పార్టీకి సీట్లు ఎక్కువ ఇస్తారు, ఎవరిని అధికారంలోకి తెస్తారు అంటే రాజకీయ వాతావరణం పోటాపోటీగా ఉంది అని అంటున్నారు. ఈ మేరకు విశ్లేషణలు కూడా అలాగే కనిపిస్తున్నాయి.
ఏపీలో మూడు ప్రధాన రీజియన్లలో ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా బలం ఉంది. దాంతో జనాల స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచింపచేస్తోంది. ఏపీలో అధికార వైసీపీని దించాలని టీడీపీ బీజేపీ జనసేనలతో జత కట్టింది. ఈ మూడు పార్టీల ఓటింగ్ బ్యాక్ దాదాపుగా ఒక్కటే కావడం విశేషం.
ఒక విధంగా ఈ పార్టీలు కలవడం వల్ల 2019లో చీలిపోయిన ఓట్లను కాపాడుకోగలుగుతారు అని అంటున్నారు. ఆ విధంగా టీడీపీకి అదనంగా మరో నలభై నుంచి యాభై సీట్ల దాకా లాభం కలిగే చాన్స్ ఉంటుందని అంటున్నారు. అంటే 2019 ఎన్నికలో టీడీపీకి వచ్చిన 23 సీట్లకు ఇవి కలుపుకుంటే నంబర్ 70 నుంచి ఎనభై దాకా గా అవుతుంది. ఇక మరింత ఊపు వస్తే ఆ నంబర్ ఇంకాస్తా పెరుగుతుంది అని అంటున్నారు.
మరి మ్యాజిక్ ఫిగర్ 88కి ఇది రీచ్ అవుతుందా అన్నదే చర్చగా ఉంది. ఇక రాయలసీమలో వైసీపీకి గట్టి పట్టుంది. కొన్ని సీట్లు అక్కడ తగ్గినా మెజారిటీ ఆ పార్టీకే వస్తాయని అంటున్నారు. అయితే ప్రకాశం నెల్లూరులలో వైసీపీ కొన్ని సీట్లు కోల్పోతుంది అని అంటున్నారు. అదే టైం లో 2014లో వైసీపీ పోగొట్టుకున్న సీట్లను మించి 2019 లో కోస్తాలో స్వీప్ చేసి పారేసింది. ఇపుడు అంతలా స్వీప్ చేయకపోయినా 2014 కంటే ఎక్కువ సీట్లనే సాధిస్తే మాత్రం వైసీపీ నంబర్ కూడా 70 నుంచి 80 మధ్యలో ఉండొచ్చు అన్నది ఒక అంచనా.
మరి అదే జరిగితే ఏపీలో హంగ్ అసెంబ్లీకి ఆస్కారం ఉంటుందా అన్నది చర్చగా ఉంది. అంటే ఇక్కడ మరో మాట ఉంది. హంగ్ అసెంబ్లీ వస్తే కనుక జనసేన బీజేపీకి వచ్చే సీట్లు కీలకంగా మారుతాయని అంటున్నారు. ఏపీలో టీడీపీ మొత్తం 144 సీట్లకు పోటీ చేస్తోంది.సోలోగా మ్యాజిక్ ఫిగర్ ని సాధించే పరిస్థితి ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.
అలాగే కూటమి నుంచి భారీ పోటీని తట్టుకుని వైసీపీ 88 మార్క్ ని చేరుకుంటుందా అన్నది మరో చర్చగా ఉంది. దీని మీదనే సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ ఏపీలో హంగ్ అసెంబ్లీ వస్తుందని తేల్చేశారు. ఏపీలో ఈసారి ఎవరికీ జనాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వరు అని కుండబద్ధలు కొట్టేశారు. జగన్ మీద బాబు మీద జనాలకు ప్రత్యేకమైన ప్రేమలు ఏవీ ఉండకపోవచ్చు అని ఆయన అంటున్నారు.
ఆయన చెప్పినది తీసుకున్నా ఏపీలో ఈ ఇద్దరూ పాలన చేసి ఉన్నారు కాబట్టి జనాలు ఈ ఇద్దరి విషయంలో ప్లస్ మైనస్ లకు చూసుకుని ఓటేసినపుడు ఎవరికీ పూర్తి మెజారిటీ ఇస్తారా లేదా అంటే హంగ్ వస్తుంది అని అంటున్న వారూ ఎక్కువ మంది ఉన్నారు. మరి అలాంటి నేపధ్యం ఉంటే కనుక ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.