బిల్ గేట్స్ కు మెక్ డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కు సంబంధం తెలుసా?

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు చెబితే ఐటీ రంగంలో అద్భుతాలు గుర్తుకు వస్తాయనే సంగతి తెలిసిందే.

Update: 2025-02-16 16:30 GMT

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు చెబితే ఐటీ రంగంలో అద్భుతాలు గుర్తుకు వస్తాయనే సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆయన చేస్తోన్న సేవా కార్యక్రమాలు గుర్తుకు వస్తాయి.. సాధ్యమైనంత మందికి ఉపాధి ఇవ్వాలనే ఆలోచనలు గుర్తుకు వస్తాయి.

ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. అయితే... సాగుద్వారా కూడా ఉద్యోగాలు సృష్టించాలనే సంకల్పంతో ఇరవై ఏళ్లలో.. అమెరికాలోని ఇరవై రాష్ట్రాల్లో.. సుమారు మూడు లక్షల ఎకరాలను కొనుగోలు చేసిన బిల్ గేట్స్.. ఆ పొలాల ద్వారా పదివేల మందికి ఉపాధినివ్వాలనుకున్న సంగతి తెలుసా?

అవును... ఐటీ రంగంలోనూ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనే కాదు వ్యవసాయ రంగంలోనూ బిల్ గేట్స్ ది అందెవేసిన చెయ్యి. ఆయన సుమారు 3 లక్షల ఎకరాల్లో పలువురు రైతులు, ఆగ్రో స్టార్టప్ ల సాయంతో ఏడాదికి మూడు సీజన్ లలో రసెట్ బర్బాంక్ రకం దుంపలను పండిస్తున్నారు. వీటిని మెక్ డొనాల్డ్స్ కు అందిస్తున్నారు.

వాస్తవానికి ప్రపంచంలోనే అత్యధికంగా బంగాళాదుంపలను కొనుగోలు చేసే సంస్థ మెక్ డొనాల్డ్స్. ఈ అవుట్ లెట్లలో అందించే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం రసెట్ బర్బాంక్ రకం బంగాళాదుంపల్ని ఎంచుకుంటారు. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రకం దుంపలను లక్షల ఎకరాల్లో సాగు చేసి మెక్ డొనాల్డ్స్ కి అందించే అగ్రిమెంట్ చేసుకున్నారు బిల్ గేట్స్.

ఈ నేపథ్యంలోనే లక్ష ఎకరాల్లో వరి, ఉల్లి, క్యారెట్, మొక్కజొన్న, సోయాబీన్ లను సాగుచేస్తూ.. రెండు లక్షల ఎకరాల్లో ఈ రకం బంగాళాదుంపల్ని సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో... మెక్ డొనాల్డ్స్ కి సుమారు 35 లక్షల టన్నుల దుంపల్ని అందిస్తున్నారు. ఫలితంగా... అమెరికాలోనే అతిపెద్ద భూస్వామిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.

బిల్ గేట్స్ ఈ ఆలోచన చేయడానికి కారణం ఉంది!:

ఐటీ రంగంలో ప్రపంచలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు.. పేదలను ఐటీ రంగంవైపు మళ్లించి వారికి ఆర్థికంగా అండగా ఉండాలనుకున్నారు బిల్ గేట్స్. ఈ క్రమంలోనే 1997 సమయంలో పేద విద్యార్థులకు కంప్యూటర్లను అందించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. సౌతాఫ్రికాలోని సోవోట్ లోనూ ప్రయత్నించారు.

ఇందులో భాగంగా.. సుమారు 2000 కంప్యూటర్లను అందించగా.. అక్కడ ఎవరూ తీసుకోలేదు.. టీచర్లు కూడా వాటిని మూలన పాడేసిన పరిస్థితి. దానికి కారణం కరువు పరిస్థితులు అని గేట్స్ గుర్తించారు. దీంతో.. అక్కడి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు.. సాగు దిశగా వారిని ప్రోత్సహించాలని భావించారు.

ఈ క్రమంలోనే గేట్స్ ఫౌండేషన్ ను స్థాపించిన తర్వాత ప్రతికూల పరిస్థితులను తట్టుకునే మేలుజాతి వంగడాలను వృద్ధి చేయించి ఆఫ్రికాలోని రైతులకు ఇచ్చి సాగు చేయించడం, పెట్టుబడి కోసం వడ్డీలేని రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా 2013 వరకూ తన ఫౌండేషన్ ద్వారా పరోక్షంగా వ్యవసాయంలో భాగమయ్యారు.

అనంతరం నేరుగానే సాగు రంగంలోకి రావాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ.. ఇక్కడ కూడా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ లెక్కన ప్రపంచంలో మెక్ డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవాళ్లంతా.. బిల్ గేట్స్ పొలంలో పండిన దుంపలను రుచి చూసినట్లేనన్నమాట!

Tags:    

Similar News