నవీన్ కి చెక్ పెట్టినట్లే కేజ్రీవాల్ కి కూడా ?

2024 ఎన్నికల్లో గెలిస్తే కనుక నవీన్ భారతీయ రాజకీయాల్లోనే తిరుగులేని చరిత్ర సృష్టించేవారు.

Update: 2025-01-06 04:43 GMT

ఒడిషా సీఎం గా ఈసారి కూడా గెలిస్తే దేశంలో అత్యధిక కాలం పాలించిన సీఎం గా నవీన్ పట్నాయక్ సరికొత్త రికార్డుని నెలకొల్పి ఉండేవారు. ఆయన వరసగా అయిదు సార్లు సీఎం గా గెలిచారు. దాదాపుగా 24 ఏళ్ల పాటు పనిచేశారు. 2024 ఎన్నికల్లో గెలిస్తే కనుక నవీన్ భారతీయ రాజకీయాల్లోనే తిరుగులేని చరిత్ర సృష్టించేవారు. అంటే దాదాపుగా మూడు దశాబ్దాల సీఎం అన్న మాట.

మరి ఆ ఖ్యాతి ఆయనకు దక్కకుండా సర్వశక్తులూ ఉపయోగించి బీజేపీ ఆయనను ఓడగొట్టింది. మాజీ సీఎం ని చేసింది. దాంతో ఆయన ఎనభయ్యేళ్ళ వయసుకు చేరువ అయిన వృద్ధ నేతగా రాజకీయాల్లో మిగిలిపోయారు. ఆయనను ఓడించేందుకు బీజేపీ అనేక వ్యూహాలను అమలు చేసింది. ప్రజలలో ఎంతో అనుబంధం పెనవేసుకున్న నవీన్ పట్నాయక్ జీవించి ఉన్నంతవరకూ సీఎం అని అంతా నమ్మిన దాన్ని కమల వ్యూహం వమ్ము చేసి పారేసింది.

ఓడేంతవరకూ కూడా నవీన్ పట్నాయక్ కూడా ఆ విషయాన్ని నమ్మలేని పరిస్థితి ఉంది అంటే బీజేపీ రాజకీయ పద్మవ్యూహం ఏ స్థాయిలో అమలు చేసిందో అన్నది అర్ధం చేసుకోవాలి. ఇపుడు అదే రాజకీయ తంత్రాన్ని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీద ప్రయోగిస్తోంది అని అంటున్నారు.

ఈసారి కనుక ఆప్ ని ఓడిస్తే ఇక ఆ పార్టీకి రాజకీయంగా చావు దెబ్బ కొట్టినట్లే అన్నది బీజేపీ సిద్ధాంతకర్తల ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఆప్ కి అసలైన ఆకర్షణ కేజ్రీవాల్. ఆయనకు ఈసారి ఎన్నికలు అతి ముఖ్యమైనవి.

ఆయన మీద లిక్కర్ స్కాం ఆరోపణలు ఉన్నాయి. కొద్ది నెలల పాటు జైలుకు వెళ్ళి వచ్చారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం వెనక కూడా వ్యూహం ఉంది. తాను ప్రజా కోర్టులో నిర్దోషిగా నిరూపించుకుని మళ్లీ సీఎం గా ప్రమాణం చేస్తాను అని చెప్పి జనంలోకి వచ్చారు.

అందువల్ల ప్రజా కోర్టు కూడా ఆయనను దోషి అనాలంటే ఆయన కచ్చితంగా ఓడి తీరాలి. ఆ మీదట ఆయన న్యాయపరమైన కేసులను ఎటూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితులలో ఉన్న కేజ్రీవాల్ ని ఓడించడమే బీజేపీ పట్టుదలగా చెబుతున్నారు.

అంతే కాదు ఈసారి కేజ్రీవాల్ గెలిస్తే ఆయన వరసగా ఐదోసారి ఢిల్లీకి సీఎం గా ఉంటారు. అది ఒక రికార్డు, ఢిల్లీని ఎక్కువ సార్లు పాలించిన నేతగా కేజ్రీవాల్ కి ఇప్పటికే ఒక పేరు ఉంది. ఈసారి గెలిస్తే ఇక ఎవరూ అందుకోలేని రికార్డు ఆయన సొంతం అవుతుంది. అంతే కాదు ఏకంగా దశాబ్దన్నర కాలం పైగా సీఎం గా ఉన్న వారిగా మరో రికార్డు సృష్టిస్తారు.

అందుకే ఆయన రికార్డుకు బ్రేకులు వేస్తూ ఆయన ఆశలకు చెక్ పెడుతూ బీజేపీ దూకుడు చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ పెద్దలంతా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక విధంగా చావో రేవో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే వరసగా అక్కడ అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదని కూడా విమర్శిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఆప్ అధినేత అరవింద్ ఈసారి కూడా గెలిచి బీజేపీ రాజకీయ పద్మవ్యూహం చేదించిన అభిమన్యుడు అవుతారా లేక ఒడిషా నవీన్ పట్నాయక్ మాదిరిగా ఎన్నికల రణక్షేత్రంలో చతికిలపడతారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

Tags:    

Similar News