గంట తేడాలో 24 అక్బర్ రోడ్ లో సీన్ మొత్తం మారింది
కట్ చేస్తే.. మరో గంట గడిచేసరికి సీన్ మొత్తం మారిపోయింది. తొమ్మిది గంటల టైంలో ఉన్న అధిక్యతలకు భిన్నంగా కౌంటింగ్ ఫలితాలు రావటంతో వాతావరణం మారిపోయింది.
గంటలో ఎంత తేడా అన్నట్లుగా మారింది ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో. అప్పటివరకు ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా పాలపొంగులా మారింది. హర్యానా.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న భారీ అంచనాలతో.. సంబరాలు సైతం అంతే స్థాయిలో చేసేందుకు ప్లాన్ చేశారు. ఉదయాన్నే 24 అక్బర్ రోడ్ మొత్తం పార్టీ వర్గాలతో సందడిగా మారింది.
తొలిదశ ఫలితాలు వెలువడిన వేళలో హర్యానాలో కాంగ్రెస్ అధిక్యత కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ లో సైతం కాంగ్రెస్ పార్టీ కచ్ఛితంగా విజయం సాధిస్తుందన్న అంచనాల్ని చెప్పటంతో పార్టీ నేతలు.. కార్యకర్తల ఉత్సాహానికి అడ్డూఆపు లేకుండా పోయింది. టపాసులు కాల్చటం.. జిలేబీలు.. లడ్డూలు పంచుకుంటూ సంబరాలు చేపట్టారు. ఎటు చూసినా కోలాహ వాతావరణం నెలకొంది.
కట్ చేస్తే.. మరో గంట గడిచేసరికి సీన్ మొత్తం మారిపోయింది. తొమ్మిది గంటల టైంలో ఉన్న అధిక్యతలకు భిన్నంగా కౌంటింగ్ ఫలితాలు రావటంతో వాతావరణం మారిపోయింది. బీజేపీ పుంజుకున్నట్లుగా వార్తలు రావటం.. రౌండ్ రౌండ్ కు అధిక్యతల్లో వస్తున్న మార్పుతో కాంగ్రెస్ నేతల్లోనూ.. అభిమానుల్లోనూ సంబరాల జోష్ తగ్గిపోయింది. అప్పటివరకు మోగిన డప్పుల చప్పుడు ఆగిపోయింది.
కాస్త ఆగితే.. మళ్లీ పుంజుకుందామంటూ నేతల నోటి నుంచి మాటలు వస్తున్నా.. అక్కడి వారిలో ఆ ఉత్సాహం కనిపించలేదు. అంతేకాదు.. మధ్యాహ్నం ఒంటిగంటకు ఫలితాల మీద స్పష్టత వస్తుంది కాబట్టి.. అప్పుడు మరింత జోష్ గా సంబరాలు చేసుకుందామంటూ కొందరు నేతలు అక్కడి నుంచి వెళ్లిపోవటం.. మారుతున్న లెక్కలతో అక్కడి వాతవరణం మొత్తం మారిపోయింది.
ఉదయాన్నే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పార్టీ శ్రేణుల్ని చూసిన పార్టీ క్యాంటీన్ వారు పెద్ద ఎత్తున పూరీలు.. పకోడీలు.. తయారు చేశారు. వీటికి తోడుగా.. తీసుకొచ్చిన జిలేబీలు.. లడ్డూలు అడ్రస్ లేకుండా పోయాయి. అంచనాలకు భిన్నంగా వచ్చిన ఫలితాలతో ఒక్కసారిగా నిరాశ ఆవహించింది. ఇదంతా కేవలం గంట తేడాలో చోటు చేసుకోవటంతో ఆసక్తికరంగా మారింది. వీరి సంబరాల్ని కవర్ చేయటానికి వచ్చిన మీడియా వారంతా ఈ హడావుడి గురించి మాట్లాడుకోవటం కనిపించింది.