బీజేపీ మాస్టర్ ప్లాన్.. 60 ఏళ్లు దాటిన అందరికీ పెన్షన్!
దేశంలోని ప్రజలు అందరికీ కొత్త పింఛను పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే సామాజిక పెన్షన్లను అందజేస్తున్న ప్రభుత్వం.. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కొనసాగించే స్కీంకి రూపకల్పన చేస్తోందని చెబుతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ప్రతి ఎన్నికకు ఏదో ఒక భారీ స్కీమ్ తో వెళుతోంది. అయోధ్య రామమందిరం, ఈబీసీలకు రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలన పథకాలను గతంలో ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం 2029లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ విశేషంగా ఆకర్షిస్తోంది.
దేశంలోని ప్రజలు అందరికీ కొత్త పింఛను పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అసంఘటిత రంగంలోని వారితో సహా పౌరులందరికీ ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో సార్వత్రిక పింఛను పథకంపై కేంద్రం కసరత్తు చేస్తోందని కార్మిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అసంఘటిత రంగానికి చెందిన నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం నిర్వహింే పెద్ద పొదుపు పథకాలేవీ లేవు. ఇప్పటికే అమలులో ఉన్న ఈపీఎఫ్ వో వంటి పథకాల్లో ఉద్యోగులు, వారు పనిచేసే సంస్థ నుంచే చందాలు చెల్లిస్తారు.
వీటిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి వాటా జమకాదు. పెట్టుబడిదారుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1000 నుంచి రూ.1,500 రాబడిని అందించే అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మన్ ధన్ యోజన (పీఎం-ఎస్ఐఎం)తోపాటు 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3 వేలు అందించే ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన వంటి పథకాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. వీటికి కొంత మొత్తం ప్రజలు చెల్లిస్తుండగా, మరికొంత ప్రభుత్వం భరిస్తోంది. భారత్ లో 2036 నాటికి సీనియర్ సిటిజన్ల జనాభా 22.7 కోట్లకు చేరుతుందని అంచనా. ఇది మొత్తం దేశ జనాభాలో 15 శాతం.
2050 నాటికి సీనియర్ సిటిజన్లు దేశ జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంటున్నారు. అంటే దాదాపు 35 కోట్ల మంది వృద్ధులు దేశంలో ఉంటారని చెబుతున్నారు. వృద్ధాప్యంలో వారికి పోషణ సమస్యలు తలెత్తకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న అమెరికా, కెనడా, యూరప్, రష్యా, చైనాల్లో అమలు చేస్తున్న పెన్షన్ స్కీమ్, ఆరోగ్య సంరక్షణ, నిరుద్యోగ ప్రయోజనాలను కవర్ చేసే సామాజిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. ఇక డెన్మార్క్, నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ దేశాలు సార్వత్రిక పెన్షన్ పథకాలను అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భవిష్యత్తును పరిగణించి మనదేశంలోనూ సామాజిక భద్రత కల్పించేలా 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఒకే పింఛను పథకం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పొదుపు పింఛను పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త కార్యక్రమాన్ని అమలు చేసే అవకాశం ఉందని కార్మిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగం చేస్తున్న వేతన జీవులతోపాటు స్వయంఉపాధి పొందుతున్న వారికి కూడా కొత్త విధానం వర్తించేందుకు వీలుగా ఈపీఎఫ్ వో ఆధ్వర్యంలో విధివిధానాలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి న్యూ పెన్షన్ స్కీం అని పిలిచే ఈ కొత్త పథకం ఇప్పటికే అమలులో ఉన్న ఎన్పీఎస్ స్థానాన్ని భర్తీ చేయదని సమాచారం.