పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు...దూకుడు నిర్ణయం దిశగా బీజేపీ....?

ఇక నవంబర్ చివరిలో శీతాకాల సమావేశాలు మాత్రమే జరగాల్సి ఉంది. కానీ సడెన్ గా కేంద్రం ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది.

Update: 2023-08-31 12:40 GMT

రెండు విడతలుగా ఈ మధ్యనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగాయి. కేంద్రం తాను కోరుకున్న కీలక బిల్లులకు ఆమోదముద్ర వేయించుకుంది. ఇక నవంబర్ చివరిలో శీతాకాల సమావేశాలు మాత్రమే జరగాల్సి ఉంది. కానీ సడెన్ గా కేంద్రం ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ అయిదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. ఈ అయిదు రోజుల సెషన్ లో ఏమి చర్చిస్తారు అన్నది ఇపుడు ఒక్కసారిగా ఆసక్తిని పెంచుతోంది.

నిజానికి వర్షాకాల సమావేశాలు దాదాపుగా మణిపూర్ ఇష్యూతోనే కొట్టుకుపోయాయి. చివరలో మోడీ ప్రభుత్వం మీద విపక్షాలు అవిశ్వాసం ప్రకటించాయి. తీర్మానం మీద చర్చ జరిగింది. దాన్ని తమకు ఉన్న బలంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓడించింది. అలా రైనీ సెషన్ ముగిసింది అని అనుకున్నారు

ఇపుడు అనూహ్యంగా ప్రత్యేక సమావేశాలు అని అంటున్నారు. ఈ సమావేశాలలో ఏమి చర్చిస్తారు అంటే దేశానికి స్వాతంత్రం లభించి ఏడున్నర దశబ్దాలు గడచినా వందేళ్ల దిశగా దేశం ప్రయాణిస్తున్న నేపధ్యంలో అమృత ఘడియలుగా బీజేపీ ప్రకటించుకుంటోంది. అందువల్ల కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ స్పెషల్ సెషన్ లో చర్చిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అంటున్నారు. నిజానికి అలాంటి అంశాలు ఏమైనా చర్చించాలనుకున్నా వర్షాకాల సమావేశాలు సరిపోలేదా అన్న మాట కూడా వస్తోంది.

అయితే మాత్రం స్పెషల్ సెషన్ అంటే స్పెషలే అని కేంద్రం అంటోంది. మరి నిజంగా స్పెషల్ డెసిషన్స్ ఏమైనా ఉంటాయా అన్నదే ఇపుడు అందరికీ పట్టుకున్న అతి పెద్ద డౌట్. ఒక వైపు చూస్తే ఇండియా పేరిట దేశంలోని దిగ్గజ విపక్ష పార్టీలు అన్నీ ఒక్కటి అయ్యాయి. అవి కాస్తా పాట్నా, బెంగళూరు, ముంబై దాకా సమావేశాలు సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాయి. ముంబై మీటింగులో సీట్ల సర్దుబాటు మీద కనుక చర్చకు ఒక కొలిక్కి వస్తే ఇక సూపర్ సక్సెస్ అయినట్లే.

ఆ తరువాత బీజేపీ మీద దాదాపుగా దేశంలోని నాలుగు వందల ఎంపీ సీట్లలో ఇండియా కూటమి నుంచి ఒక్కరినే అభ్యర్ధిగా నిలబెడతారు అన్న మాట. అలా బీజేపీ వ్యతిరేక ఓట్ల చీలికను నివారిస్తే మాత్రం కమలానికి అది భారీ షాక్ గానే భావిస్తున్నారు. అందుకే విపక్ష కూటమి మరింతగా బలపడకుండా బీజేపీ కొత్త ప్లాన్స్ వేస్తోందా అన్నదే చర్చగా ఉంది.

ఈ క్రమంలో విపక్షాలకు బాంబు లాంటి డెసిషన్ ని బీజేపీ ప్రకటించనుందా అన్నది కూడా అనుమానంగా ఉంది అంటున్నారు. కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సెషన్ అంటే పార్లమెంట్ ని రద్దు చేసినా చేస్తుందని అంటున్నారు. అలాగే జమిలి ఎన్నికలు లేదా మధ్యంతరం వైపుగా వేగంగా అడుగులు వేయవచ్చు అని అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.

వాటితో పాటే కేంద్రంలో కూడా ఎన్నికలు జరిపించేలా బీజేపీ అగ్ర నాయకత్వం కీలక నిర్ణయం దిశగా ముందుకు సాగే చాన్సులు ఉన్నాయని ఢిల్లీ వర్గాలలో జోరుగా వినిపిస్తున్న మాటగా ఉందిట. మొత్తం మీద చూస్తే పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ అంటే వెరీ స్పెషల్ అని అంటున్నారు. అంతే కాదు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే డెసిషన్ ఈ సెషన్ లో తీసుకుంటారు అని పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News