మస్క్ పుత్రరత్నం చేసిన పని.. 145 ఏళ్ల డెస్క్ మార్చిన ట్రంప్!
మస్క్ కుమారుడు చేసిన పనివల్ల ట్రంప్ తన డెస్క్ ను మార్చుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ 2.0లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అత్యంత కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ప్రెసిడెంట్ ట్రంప్ ను కలిశారు. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో వీరిద్దరూ మీడియా సమావేశంలో పాల్గొన్న సమయంలోనూ.. మస్క్ కుమారుడు చేసిన అల్లరి నెట్టింట వైరల్ గా మారింది.
ఇతడిని కాసేపు కింద నిలబెట్టి.. కాసేపు తన భుజాలపైన కూర్చోబెట్టుకుని మస్క్ విత్ సన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు! దీనికి సంబంధించిన వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ సంగతి అలా ఉంటే.. నాడు మస్క్ కుమారుడు చేసిన అల్లరి వల్ల ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. తన డెస్క్ ను మార్చుకున్నారని అంటున్నారు.
అవును... మస్క్ కుమారుడు చేసిన పనివల్ల ట్రంప్ తన డెస్క్ ను మార్చుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఓవల్ ఆఫీసులో 145 ఏళ్ల పురాతన రెజల్యూట్ డెస్క్ ను ట్రంప్ తీసేయించారని అంటున్నారు. దాని స్థానంలో సీ అండ్ ఓ డెస్క్ ను పెట్టించారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్రంప్ తన ట్రూత్ అకౌంట్ లో పంచుకున్నారు.
ఇందులో భాగంగా... వైట్ హౌస్ లోని 7 డెస్కుల్లో ఏదో ఒకదానిని ఎంచుకునే అవకాశం ప్రెసిడెంట్ కు ఉంటుందని.. ఈ సీ అండ్ ఓ డెస్క్ ను గతంలో జార్జ్ బుష్ తో పాటు మరికొంతమంది అధ్యక్షులు వినియోగించారని.. ఇప్పటివరకూ ఓవల్ ఆఫీసులో ఉన్న రెజల్యూట్ డెస్క్ ను మరమ్మతుల కోసం పంపించినట్లు వెల్లడించారు.
ఇక ఈ రెజల్యూట్ డెస్క్ ను 1880లో అప్పటి బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా.. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రూథర్ ఫోర్డ్ కు గిఫ్ట్ గా ఇవ్వగా.. అది బ్రిటీష్ రాయల్ నేవీలో సేవలందించి వైదొలిగిన హెచ్.ఎం.ఎస్. రెజల్యూట్ అనే నౌక చెక్కతో తయారుచేశారు.
అయితే... ఎలాన్ మస్క్ కుమారుడు ఆ టేబుల్ పై చేతులు పెట్టడం, రుద్దడం వంటి పనుల చేశాడు. ఈ సమయంలో... బాక్టీరియా భయంతో అతి శుభ్రతను పాటించే డొనాల్డ్ ట్రంప్.. మస్క్ పుత్రరత్నం చేష్టల కారణంగానే టేబుల్ ను మార్చినట్లు మీడియాలో కథనాలు వస్తుండటం గమనార్హం.