పవార్ కుర్చీ లాగినా.. వేసినా.. నీళ్లు తాగించినా అది మోదీకే సాధ్యం

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ ఎవరంటే ముందుగా చెప్పాల్సిన పేరు శరద్ పవార్.. 38 ఏళ్లకే మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి సీఎం అయిన ఘనత ఆయనది.

Update: 2025-02-22 11:10 GMT

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ ఎవరంటే ముందుగా చెప్పాల్సిన పేరు శరద్ పవార్.. 38 ఏళ్లకే మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి సీఎం అయిన ఘనత ఆయనది. సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నించి.. సొంత పార్టీ పెట్టుకుని.. ఆపై 25 ఏళ్లుగా అదే పార్టీతో పొత్తు పెట్టుకున్న చాణక్యం శరద్ పవార్ సొంతం. కచ్చితంగా ప్రధాని పదవి దక్కుతుందని ఆశించి విఫలమై.. కేంద్ర మంత్రి పదవితో సరిపెట్టుకున్న సమర్థత ఆయనది.

అలాంటి శరద్ పవార్ ఇప్పుడు 83 ఏళ్ల వయసులో రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారు. ఏడాదిన్నర కిందట ఆయన పార్టీ ఎన్సీపీ నిలువునా చీలిపోవడం.. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయంతో శరద్ పవార్ ఇక తప్పుకొంటారనే అనుకుంటున్నారు. కాగా.. ఎప్పుడు ఎలా నడుచుకోవాలో కూడా శరద్ పవార్ కు బాగా తెలుసని అంటారు. అలాంటి పెద్ద పవార్ తదుపరి ఏం చేయనున్నారనే ఆసక్తి నెలకొంది.

మహారాష్ట్రలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. వీటిలో ఉనికి చాటుకోవడం ఎన్సీపీ (శరద్ పవార్)కి అవసరం. అలాంటి సమయంలో రాష్ట్ర రాజకీయాలు శరద్ కు అనుకూలంగా మారుతున్నాయి. అధికార మహాయుతిలో అభిప్రాయ భేదాలు శరద్ పవార్ కు కొత్త స్నేహహస్తం చాస్తున్నాయి. గత వారం మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రత్యర్థి శిబిరాల నాయకులు కలుసుకోవడమే ఆ విశేషం.

తాజాగా శుక్రవారం ఢిల్లీలో అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విజ్ఞాన్‌ భవన్‌ లోని వేదికపై శరద్‌ పవార్‌ కుర్చీలో కూర్చోవడానికి కాస్త ఇబ్బంది పడగా ప్రధాని మోదీ ఆయనకు సాయం చేశారు. ఆ తర్వాత తన చేతితో స్వయంగా గ్లాసులో నీళ్లు నింపి శరద్ పవార్ కు అందించారు. ఈ సీన్ ను చూసిన అక్కడున్నవారంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనికిముందు శరద్‌ పవార్‌ తన ప్రసంగంలో మోదీని ప్రశంసించడం గమనార్హం. మరాఠీకి ప్రాచీన భాష హోదా ఇవ్వడంలో ప్రధాని పాత్ర కీలకమని కొనియాడారు. ఇలా మాట్లాడిన అనంతరమే పవార్‌ కుర్చీలో కూర్చొనేందుకు మోదీ సాయపడడం గమనార్హం.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శి అయిన ఆర్ఎస్ఎస్ ను శరద్ పవార్ కొనియాడిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News