256 షోలో మెగాస్టార్ ఎదుట‌ ఎమోష‌న్ పండించాడు

మిత్రభా వ‌రుస ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానాలిచ్చాడు. 20,000 ప్ర‌శ్న‌.. చివ‌రికి 3.2ల‌క్ష‌ల‌ ప్ర‌శ్న‌ను కూడా ఎదుర్కొని డ‌బ్బును గెలుచుకున్నాడు.

Update: 2025-02-22 17:43 GMT

'కౌన్ బనేగా కరోడ్‌పతి' 16వ సీజ‌న్‌ని ర‌క్తి క‌ట్టించ‌డంలో హోస్ట్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఎప్ప‌టిలానే ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. తాజా ఎపిసోడ్ లో ప్ర‌ముఖ చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ క్విజ్ షో విజేత‌ హోస్ట్ అమితాబ్ ముందు ఉన్నారు. భారతదేశపు 72వ చెస్ గ్రాండ్‌మాస్టర్ కోల్‌క‌తా వాసి 23 ఏళ్ల మిత్రభా గుహా తాజా ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఈ షోలో తొలుత మిత్రభా ప్రయాణం గురించి ఒక చిన్న వీడియో ప్రసారం అయింది. దీనిలో త‌న‌ మొదటి పుట్టినరోజున ఒక బంధువు పెద్ద చెక్క చెస్ సెట్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ బ‌హుమ‌తి అత‌డి జీవితంలో కీల‌క మ‌లుపు.

మిత్రభాకు రెండున్నర సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు త‌న తండ్రి చెస్‌కు పరిచయం చేశాడు. నాలుగు సంవత్సరాల వయస్సులో చెస్ అకాడమీలో చేర్పించడానికి ప్రయత్నించారు కానీ ఆ సంస్థ 6 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు మాత్రమేన‌ని ష‌ర‌తులు విధించింది. అయితే మిత్ర‌భా అద్భుతమైన నైపుణ్యం, ఆట‌తీరు చూసిన తర్వాత కోచ్ మినహాయింపు ఇచ్చి శిక్ష‌ణ ఇచ్చేందుకు అనుమతించాడు. మిత్రభా 2004లో ఛాంపియన్‌షిప్‌లలో పోటీపడటం ప్రారంభించాడు. చాలా వేగంగా రికార్డులు సృష్టించాడు.

ఆర్థిక పరిమితుల కారణంగా 2018లో మాత్రమే తన మొదటి అంతర్జాతీయ పర్యటనను ప్రారంభించగ‌లిగాడు. ఛాంపియన్‌షిప్ కోసం స్పెయిన్‌కు వెళ్లినప్పుడు త‌న త‌ల్లి బంగారం తాక‌ట్టు పెట్టిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. అందుకే త‌న విజయాన్ని మిత్ర‌భా త‌న‌ తల్లిదండ్రులకు జమ చేసాడు. మిత్రభాతో హోస్ట్ ఆట ప్రారంభించి రూ. 1000 విలువైన‌ మొదటి ప్రశ్నను గెలుచుకున్నాడు. మ‌ధ్య‌లో చాట్ స‌మ‌యంలో మిత్ర‌భా ప్రస్తుత ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజుతో ఆట‌ ఆడిన అనుభవాన్ని షేర్ చేసాడు. కోల్‌కతాలో జరిగిన చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేష్‌ను చిన్నతనంలో ఓడించడం ఆనందంగా ఉంద‌ని అన్నాడు. లాక్‌డౌన్ సమయంలో మిత్ర‌భా గుకేష్‌తో చాలాసార్లు ఆన్‌లైన్ చెస్ ఆడాడు.

మిత్రభా వ‌రుస ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానాలిచ్చాడు. 20,000 ప్ర‌శ్న‌.. చివ‌రికి 3.2ల‌క్ష‌ల‌ ప్ర‌శ్న‌ను కూడా ఎదుర్కొని డ‌బ్బును గెలుచుకున్నాడు. తాను గ్రాండ్‌మాస్టర్ అయ్యే వరకు 20 సంవత్సరాలు ప్రతిరోజూ 8-10 గంటలు చెస్ ఆడానని మిత్రభా చాటింగ్ స‌మ‌యంలో తెలిపారు. ప్రస్తుతం అతడు హెచ్ ఆర్ - మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేస్తున్నాడు. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినందున అతడు ప్రస్తుతం కోల్‌కతా మెట్రో రైల్వేస్‌లో పనిచేస్తున్నాడు.

పోటీలో రూ. 20,000 ప్రశ్న ఆస‌క్తిక‌రం. మొఘల్ రాజవంశం కోసం షాజహాన్ నియమించిన సింహాసనానికి ప్రముఖంగా ఏ పక్షి పేరు పెట్టారు? మిత్రభా ఎంపిక C) నెమలి. అతడు ఆ మొత్తాన్ని గెలుచుకున్నాడు. సింహాసనంలో కోహినూర్ వజ్రం కూడా ఉందని మిత్ర‌భా త‌న జవాబు స‌మ‌యంలో పేర్కొన్నాడు. దీనికి ప్రతిస్పందనగా అమితాబ్ బచ్చన్ భారతదేశం నుండి కోహినూర్‌ను దొంగిలించిన దొంగ‌ల్ని విమర్శించారు. విలువైన రత్నం చారిత్రాత్మక దొంగతనంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చిన తర్వాత మిత్రభా రూ. 3,20,000 ఇంటికి తీసుకువెళ్లాడు.

Tags:    

Similar News