దాసుగారి విధేయతకు మోడీ వీరతాడు.. ఈ విషయాలు తెలుసా?
అయితే.. అలాంటి సమయంలోనూ.. భారత్ ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఇతర ప్రపంచ దేశాల మాదిరిగా కాకుండా.. జాగ్రత్తగా అడుగులు వేసింది.
''కరోనా సమయంలోనూ భారత దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. దీనిని అందరూ గమనించాలి. ఇలా ఎలా ఉందనేది ఇప్పటి కీ ఆశ్చర్యమే!''- కొన్నాళ్ల కిందట.. ఐక్యరాజ్యసమితిలో వివిధ ప్రపంచ దేశాలు చేసిన ప్రకటన ఇది. వాస్తవంకూడా ఇదే. ప్రపంచ దేశాలు.. కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా కుదేలయ్యాయి. వృత్తులు, ఉద్యోగాలపై కరోనా తీవ్రంగా ప్రభావం చూపించింది. లాక్‌డౌన్లు దేశాలను కుదిపేశాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. అయితే.. అలాంటి సమయంలోనూ.. భారత్ ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఇతర ప్రపంచ దేశాల మాదిరిగా కాకుండా.. జాగ్రత్తగా అడుగులు వేసింది.
ఈ వ్యవహారం.. ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రపంచం మొత్తం పొడిగింది. భారత ప్రధానిగా అప్పటి వరకు మోడీకి ఉన్న మార్కులు.. అమాంతం పెరిగాయి. దీంతో ఆయన ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగార నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇలా మోడీకిపేరు తేవడానికి.. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి కారణం.. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంత దాస్. రెపో రేటును ఏమాత్రం సవరించకుండా.. ఆరు ఏళ్లపాటు ఆయన మెయింటెన్ చేశారు. నిజానికి ఇదేమీ తేలిక కాదు. రెపో రేటు తగ్గించాలని కీలక పారిశ్రామిక వర్గాల నుంచి స్టాక్స్ వరకు తీవ్రమైన వత్తిళ్లు వచ్చాయి. అయినా.. ఆర్థిక మాంద్యం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా.. ఆయన రెపో రేటును 6.5 వద్దే ఉంచారు.
ఒకానొక దశలో 7వరకు కూడా తీసుకువెళ్లారు కూడా. కానీ, ఆ వెంటనే సవరించుకుని 6.5 శాతం వద్ద నిలకడగా కొనసాగించా రు. ఆనాటి నుంచి ఇటీవల వరకు కూడా.. అలానే వ్యవహరించారు. ఇక, ద్రవ్యోల్బణం విషయంలోనూ చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ఇరుకున పడకుండా..ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు అదేవిధంగా పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూడా శక్తికాంత దాస్ కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా జీఎస్టీ అమలు విషయంలో ఎదురైన అనేక సవాళ్లను కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగారు.
ఇవన్నీ కూడా.. ప్రధానిమోడీకి దేశీయంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చాయి. దీంతో దాసుగారి విధేయతకు మెచ్చిన మోడీ.. తాజాగా వీరతాడును అలంకరించారు. పనిగట్టుకుని 'పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ -2' పోస్టును క్రియేట్ చేశారు. వాస్తవానికి మోడీ పదేళ్ల పాలనలో ఇప్పటివరకు ఈ పోస్టు లేదు. కేవలం పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక్కరే ఉన్నారు. కానీ, తాజాగా గత డిసెంబరులో రిటైరైన శక్తికాంత దాస్ కోసమే ఈ పోస్టును సృష్టించి.. ఆయనను నియమించారు. ఈపదవిలో ప్రధాని మోడీ ఉన్నంత వరకు దాసు ఉండనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. 40 ఏళ్లకు పైగా.. వివాద రహితంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.