ఒక్క మ్యాచ్ కోసం స్పెషల్ కోచ్.. పాకిస్థాన్ పడరాని పాట్లు..
ముదస్సర్ నాజర్.. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. ఇప్పుడు ఆయనను భారత్ తో మ్యాచ్ కు ముందు స్పెషల్ కోచ్ గా నియమించుకుంది పాకిస్థాన్.
సొంతగడ్డపై టోర్నీ.. ఆపై డిఫెండింగ్ చాంపిన్.. కానీ, తొలి మ్యాచ్ లో ఓటమి.. మరొక మ్యాచ్ లో ఓడితే ఇక ఇంటికే.. ఆ మ్యాచ్ కూడా చిరకాల ప్రత్యర్థి.. పటిష్ఠంగా ఉన్న భారత్ తో .. ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టుకైనా ఎలా ఉంటుంది...? అది పాకిస్థాన్ అయితే..? చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పుడు ఆ జట్టుకు చావోరేవో..
తటస్థ వేదిక దుబాయ్ లో ఆదివారం పాకిస్థాన్ అత్యంత క్లిష్ట సమరం ఎదుర్కొననుంది. భారత్ తో జరిగే ఈ మ్యాచ్ లో గనుక ఓడిపోతే ఆ జట్టు ఇక ఇంటికే. ఇప్పటికే న్యూజిలాండ్ పై ఓడిపోవడంతో పాక్ మీద అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో తీవ్ర ఒత్తిడిలో పడింది.
సాధారణంగానే భారత్ ను ఓడించడం పాకిస్థాన్ కు కాస్త కష్టం. ఇప్పుడు దుబాయ్ లో అదీ వన్డేలో ఓడించడం అంటే ఇంకా కష్టం. మరి ఏం చేయాలి..? పైగా తమ జట్టు కీలక ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయంతో టోర్నీ అంతటికీ దూరమయ్యాడు. జమాన్ గత చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పై సెంచరీ కొట్టిన వాడు. అతడు లేకపోవడంతో పాక్ ఆత్మస్థైర్యం సన్నగిల్లింది.
నాజర్ సాబ్.. జర ఆవో..
ముదస్సర్ నాజర్.. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. ఇప్పుడు ఆయనను భారత్ తో మ్యాచ్ కు ముందు స్పెషల్ కోచ్ గా నియమించుకుంది పాకిస్థాన్. ముదస్సర్ నాజర్ గతంలో కెన్యా, యూఏఈ జట్లకు కోచ్ గా పనిచేశాడు.
ముదస్సర్ నాజర్ 76 టెస్టుల్లో 4,114 పరుగులు చేశాడు. 122 వన్డేల్లో 2,653 పరుగులు సాధించాడు. కుడిచేతివాటం మీడియం పేస్ తో టెస్టుల్లో 66 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 111 వికెట్లు తీశాడు. 1976 నుంచి 1989 వరకు పాకిస్థాన్ కు ప్రాతినిధ్యం వహించాడు.