భారత్ - పాక్... ఆదివారం మ్యాచ్ కు ముందు తెరపైకి ఆస్తకికర విషయం!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ విజయంతో బోణీ కొట్టగా.. పాకిస్థాన్ పరాజయంతో ప్రారంభించింది.
భారత్ – పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! మైదానంలో ఆ 22 మంది మధ్య జరిగే పోరు ఒకెత్తు అయితే.. మైదానం వెలుపల, టీవీల ముంగిట కోట్ల మంది ప్రేక్షకుల మధ్య ఉత్కంఠ మరొకెత్తు అని అంటారు. ఈ సమయంలో ఆదివారం (ఫిబ్రవరి 23) న మరోసారి భారత్ – పాకిస్థాన్ తలపడనున్నాయి.
ఈ సమయంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. 1992 వరల్డ్ కప్ నుంచి 2010 వరకూ ఈ ఇరు దేశాల మధ్య జరిగిన ఫేమస్ వివాదాలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో... నాడు జావెద్ మియాందాద్ - కిరణ్ మోరె మధ్య మొదలైన వివాదం నుంచి ఇటీవల అక్తర్ కు హర్భజన్ సింగ్ కు మధ్య జరిగిన రచ్చ వరకూ జరిగిన విషయాలు ఒకసారి గుర్తుచేసుకుందాం..!
అవును... భారత్ – పాక్ మధ్య మ్యాచ్ అంటే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కంటికి కనిపించని ఫైర్ ఒకటి రగులుతూ ఉంటుందని చెబుతుంటారు. ఈ క్రమంలో దాన్ని కొంతమంది బయటకు చూపిస్తే.. మరికొంతమంది లోలోపల ఉంచుతుంటారు. ఈ సమయంలో బయటకు చూపించేవారి అగ్రసివ్ నెస్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఆ జాబితాలో కొన్ని ఇప్పుడు చూద్దామ్..!
1992 వన్డే వరల్డ్ కప్.. మియాందాద్ అతి!:
1992లో భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో వికెట్ల వెనుక టీమిండియా కీపర్ కిరణ్ మోరె మాట్లాడుతుంటే.. అందుకు జావెద్ మియాందాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కిరణ్ తో జావెద్ ఏదో వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత కిరణ్ ను అనుసరిస్తూ జావెద్ కంగారుల మాదిరి ప్రవర్తించాడు. ఈ తీరు నాటి భారత కెప్టెన్ అజారుద్దీన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
1996 వన్డే వరల్డ్ కప్.. వెంకటేష్ ప్రసాద్ రివేంజ్!:
వన్డే వరల్డ్ కప్ - 1996లో భారత్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ లో పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ అమిర్ సోహైల్ బౌండరీ కొట్టాడు. అనంతరం తాను కొట్టిన బంతి వెళ్లిన ప్రదేశం వైపు చూపిస్తూ బౌలర్ ను ఎగతాళి చేశాడు. దీంతో.. మాటలతో వద్దు చేతలతోనే అనుకున్నాడో ఏమో.. వెంకటేష్ ప్రసాద్ తన నెక్స్ట్ బంతికే అమీర్ సోహైల్ ను ఔట్ చేశాడు. ఈ అద్భుతమైన సెండ్ ఆఫ్ తో ఆటతీరు భారత్ వైపు మార్చబడింది.
1997లో ఓ మ్యాచ్... ఇంజమామ్ పై "ఆలూ" కామెంట్స్!
1997లో జరిగిన ఓ మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ఓ క్రికెట్ ఫ్యాన్ "ఆలూ" (బంగాళాదుంప) అని గట్టిగా అరిచాడు. ఇంజమామ్ లావుగా ఉండటం వల్ల అతడు వెటకారం ఆడినట్లున్నాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి, బ్యాట్ ను తెప్పించిన ఇంజమామ్.. ప్రేక్షకుల దిశగా చూసి ‘ఇప్పుడు అనండి’ అంటూ బ్యాట్ చూపించాడు.
దీంతో.. స్టేడియంలో ఒక్కసారిగా గోల గోలగా మారిపోయింది. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బంది.. పరిస్థితిని చక్కదిద్దారు. మరోపక్క ప్రవర్తనపైనా ఇంజిమామ్ ను ఐసీసీ మందలించింది.
2007 మ్యాచ్... గంభీర్ వర్సెస్ అఫ్రిదీ.. వేరే లెవెల్!
అఫ్రిద్ బౌలింగ్ లో 2007లో జరిగిన మ్యాచ్ లో గంభీర్ బౌండరీ కొట్టాడు. దీంతో.. వీరిద్ధరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఉద్దేశ్యపూర్వకంగానే అన్నట్లుగా వికెట్ల మధ్య పరుగెడుతున్నప్పుడు వారు ఢీకొనడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదు.. గంభీర్ అస్సలు తగ్గడం లేదు!
దీంతో.. ఫీల్డ్ అంపైర్ కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇప్పటికీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు, చర్చలు వైరల్ గా మారుతుంటాయి.
2010 ఆసియా కప్... హర్భజన్ వర్సెస్ అక్తర్.. ఇది పీక్స్!
ఇండియా - పాకిస్థాన్ మధ్య మైదానంలో జరిగిన వివాదాల్లో గంభీర్ - అఫ్రీది మధ్య వివాదం ఒకెత్తు అయితే... హర్భజన్ సింగ్ - షోయబ్ అక్తర్ మధ్య వివాదం పీక్స్ అనే చెప్పాలి. 2010 ఆసియాకప్ లో భజ్జీ బ్యాటింగ్ చేస్తుండగా.. అక్తర్ డాట్ బాల్స్ వేసి కట్టడి చేస్తూ.. స్లెడ్జింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఓ పక్క బంతులు పూర్తైపోతున్నాయి.. టీమిండియా వైపు టెన్షన్ పెరిగిపోతుంది.
ఈ సమయంలో అక్తర్ పై ముందు నోటితో ఆగ్రహం వ్యక్తం చేసిన హర్భజన్ సింగ్... చివరి ఓవర్ లో ఆమిర్ వేసిన బంతిని సిక్స్ గా మలిచి భారత్ ను గెలిపించాడు. అనంతరం అక్తర్ వద్దకు వెళ్లి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. అది ఇప్పటికీ దాయాదీ క్రికెట్ చరిత్రలో ఆసక్తికర ఎపిసోడ్ గా నిలబడింది!
2025 ఛాంపియన్స్ ట్రోఫీ!:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ విజయంతో బోణీ కొట్టగా.. పాకిస్థాన్ పరాజయంతో ప్రారంభించింది. ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ పై భారత్ సునాయాస విజయాన్ని నమోదు చేయగా.. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాక్ కు కివీస్ చేతిలో పరాభవం ఎదురైంది. ఈ రెండు జట్లు ఆదివారం తలపడనున్నాయి.
దీంతో.. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తోంది. మరి ఈ మ్యాచ్ వీలైనంత సాఫీగానే సాగిపోతుందా.. లేక, ఏవైనా రసవత్తరమైన ఘట్టాలు చోటు చేసుకుంటాయా అనేది వేచి చూడాలి!